Ex BCCI Selector On Rahul Dravid : టైటిల్ ఫేవరెట్ జట్టుగా ఆసియా కప్‌లోకి అడుగుపెట్టిన టీమ్ ఇండియా.. పేలవ ప్రదర్శనతో ఇంటి దారి పట్టిన విషయం తెలిసిందే. సూపర్ 4 దశలో పాక్, శ్రీలంకపై ఓడి భారత అభిమానుల ఆశలను గల్లంతు చేస్తూ ట్రోఫీ నుంచి నిష్క్రమించింది. అయితే, త్వరలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ ముందు భారత జట్టుకు ఈ ఓటమి మేల్కొలుపు లాంటిదని మాజీ ఆటగాళ్లు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ఇది ఎంతో కఠిన సమయమని బీసీసీఐ మాజీ సెలెక్టర్ సబా కరీమ్ అంటున్నారు. కోచ్‌గా అతడి హనీమూన్ కాలం ముగిసిందని, ఇక జట్టుపై గట్టిగా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ద్రవిడ్ పనితీరుపై సబా ఓ క్రీడా ఛానల్‌తో విశ్లేషించారు.
'2021లో టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ద్రవిడ్‌పై ఎన్నో అంచనాలు వెలువడ్డాయి. కోచ్‌గా హనీమూన్ కాలం ముగిసిందని ద్రవిడ్‌కూ తెలుసు. అతడు తన ఉత్తమ ప్రదర్శనను అందించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. అయితే.. జట్టులో ఆ ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఇది అతడికి కఠిన సమయం. అతడి కోచింగ్‌లో టీమిండియా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్, ఇంగ్లాండ్‌తో చివరి టెస్టులో విజయం సాధించడం ఆనందమే.