టీమ్ఇండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ ట్రోర్నీ విజయ్ హజారే ట్రోఫీ రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సంచలన రికార్డు నమోదు చేశాడు. ఏకంగా ఓవర్లో 7 సిక్సులు బాది సంచలనం సృష్టించాడు.
ఒకే ఓవర్లో 43 పరుగులు..రెండోక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా మహారాష్ట్ర ఉత్తర్‌ప్రదేశ్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న రుతురాజ్.. ఇన్నింగ్స్ 49వ ఓవర్లో యూపీ బౌలర్ శివ సింగ్ వేసిన బౌలింగ్‌లో.. వరుసగా ఏకంగా 7 సిక్స్‌లు బాది.. డబుల్ సెంచరీ పూర్తి చేశాడు.
అయితే వరుసగా నాలుగు బంతులను రుతురాజ్ సిక్సర్లుగా మలచగా.. ఒత్తిడికి గురైన బౌలర్ ఐదో బంతిని నోబాల్ వేశాడు. దీంతో మరో బాల్ వేయాల్సి వచ్చింది. ఇలా వేసిన బంతిని వేసినట్లు.. స్టాండ్‌లోకి పంపించాడు రుతురాజ్. అలా ఈ ఓవర్లో 43 పరుగులు వచ్చాయి. మొత్తంగా 159 బంతుల్లో 10 ఫోర్లు, 16 సిక్సులతో మెుత్తం 220 పరుగులు చేశాడు. దీంతో మహారాష్ట్ర ఐదు వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది.
ఒకే ఓవర్లో 8 సిక్స్‌లు..ఒక ఓవర్లో అత్యధిక సిక్సులు కొట్టిన రికార్డు న్యూజిలాండ్ లిస్ట్-ఏ క్రికెటర్ లీ జెర్మోన్ పేరిట ఉంది. 1990లో షెల్ ట్రోఫీ మ్యాచ్‌లో భాగంగా అతడు ఒకే ఓవర్లో ఎనిమిది సిక్సులు కొట్టాడు. అయితే, ఆ మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు.. కావాలనే అదనపు పరుగులు ఇచ్చింది. బ్యాటర్.. సిక్సులు, ఫోర్లు కొట్టేలా బంతులు విసిరింది.
అనేక వైడ్లు, నోబాల్స్ కలిపి... ఒకే ఓవర్లో మొత్తం 77 పరుగులు సమర్పించుకుంది. ఇక ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదిన క్రికెటర్లలో సర్ గార్ఫీల్డ్ సోబర్స్(వెస్టిండీస్), రవిశాస్త్రి(టీమ్ఇండియా), గిబ్స్(దక్షిణాఫ్రికా), యువరాజ్ సింగ్(టీమ్ఇండియా), రాస్ వైట్లీ(ఇంగ్లాండ్), హజ్రతుల్లా(అప్ఘానిస్థాన్), లియో కార్టర్(న్యూజిలాండ్), కీరన్ పొలార్డ్(వెస్టిండీస్), తిసారా పెరెరా(లంక) ఉన్నారు.
ఇదీ చదవండి:'వన్డే ప్రపంచకప్ గురించి అస్సలు ఆలోచించడం లేదు.. వర్షాలు చికాకు తెప్పిస్తున్నాయి'