Highest Team Score In Asia Cup :ప్రతిష్టాత్మక ఆసియా కప్ వేదికగా ఇండియా, పాకిస్థాన్‌తో పాటు మరో 4 దేశాలు పోటా పోటీగా తలపడుతున్నాయి. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆసియా కప్ ఫీవర్ నడుస్తోంది. ఆగస్ట్ 30న మొదలై సెప్టెంబరు 17 వరకు జరగనున్న ఈ మినీ టోర్నీలో మున్ముందు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ క్రమంలో భారీ స్కోర్లు సాధించి ప్రత్యర్థులను మట్టి కరిపించాలని ఆయా జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. మ్యాచులు గెలవాలన్నా.. విజేతగా నిలిచి కప్పును ముద్దాడాలన్నా.. మంచి స్కోరు చేయడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఆసియా కప్ చరిత్రలో (వన్డే ఫార్మాట్ ) ఇప్పటి వరకు అత్యధిక స్కోరు సాధించిన జట్లు గురించి ఓ సారి చూద్దామా..
- పాకిస్థాన్
ఆసియా కప్ చరిత్రలో అత్యధిక స్కోరు కొట్టిన జట్టుగా పాకిస్థాన్ మొదటి స్థానంలో నిలిచింది. 2010లో శ్రీలంక వేదికగా జరిగిన టోర్నీలో బంగ్లాదేశ్‌పై పాక్.. 7 వికెట్ల నష్టానికి 387 పరుగులు సాధించింది. ఆ మ్యాచ్‌లో పాక్ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిది చెలరేగి ఆడటం వల్ల ఆ స్కోరు నమోదైంది. ఆ మ్యాచ్ లో ఆఫ్రిది 60 బంతుల్లో 124 పరుగులు కొట్టాడు. ఫలితంగా పాక్ ఈ రికార్డు నమోదు చేసింది. - ఇండియా
2008 లో పాకిస్థాన్ వేదికగా జరిగిన ఆసియా కప్ టోర్నీలో హాంగ్‌కాంగ్ జట్టుతో తలపడ్డ టీమ్ఇండియా.. ఆ మ్యాచ్‌లో 374/4 రన్స్ కొట్టింది. కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ, సురేశ్ రైనా.. ఈ మ్యాచ్‌లో మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక ఇద్దరూ శతకాలు బాదడం వల్ల టీమ్ఇండియా భారీ స్కోరు చేసింది. - శ్రీలంక
2008 ఆసియా కప్ ఎడిషన్‌లో బంగ్లాదేశ్‌తో తలపడిన మ్యాచ్‌లో శ్రీలంక జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. 9 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. ఆ మ్యాచ్‌లో లంక బ్యాటర్లు సమష్టిగా రాణించడం వల్ల రికార్డు స్థాయిలో రన్స్ నమోదైంది. - పాకిస్థాన్
2004లో శ్రీలంక వేదికగా జరిగిన ఆసియా కప్ టోర్నీలో హాంగ్‌కాంగ్ జట్టుపై పాక్.. తన రెండో అత్యధిక స్కోరును నమోదు చేసింది. కొలంబోలో జరిగిన ఆ మ్యాచ్‌లో పాక్.. 343/5 రన్స్ చేసింది. పాక్ జట్టు బ్యాటర్లు యూనిస్ ఖాన్, షోయబ్ మాలిక్ మంచి భాగస్వామ్యంతో ఆ స్కోరు చేయగలిగింది. - పాకిస్థాన్
ప్రస్తుత ఆసియా కప్ టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు చెలరేగి ఆడింది. నేపాల్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో ఆ జట్టుపై భారీ స్కోర్ చేసింది. ఇక పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ తనదైన శైలిలో ఆడి 151 పరుగులు సాధించగా.. మరో బ్యాటర్ ఇఫ్తికర్ అహ్మద్ 109 పరుగులు చేయడం వల్ల జట్టు మొత్తం స్కోరు 342/6 కు చేరింది. ఇక ఈ మ్యాచ్‌లో పాక్‌దే పై చేయిగా నిలిచింది.