Highest Run Scorers Ind vs Sa Test Series :సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడేందుకు భారత్ సిద్ధమైంది. మంగళవారం (డిసెంబర్ 26న) సెంచూరియన్ సూపర్‌స్పోర్ట్స్ పార్క్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. ఇప్పటివరకూ భారత్- సౌతాఫ్రికా మధ్య 42 టెస్టులు జరిగాయి. అందులో భారత్ 15 టెస్టుల్లో నెగ్గి, 17 మ్యాచ్‌ల్లో ఓడింది. మిగతా 10 మ్యాచ్‌లు డ్రా గా ముగిశాయి. ఇక సఫారీ గడ్డపై 23 టెస్టులాడిన టీమ్‌ఇండియా కేవలం 4 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. 12 మ్యాచ్‌ల్లో ఓడి, 7 మ్యాచ్‌లు డ్రా చేసుకుంది. అయితే ఇప్పటివరకూ జరిగిన ఈ మ్యాచ్‌ల్లో ఇరుజట్లులలో కలిపి అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లెవరో తెలుసుకుందాం.
- సచిన్ తెందూల్కర్ : క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ భారత్- సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌ల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. సౌతాఫ్రికాతో 25 టెస్టు మ్యాచ్‌లు ఆడిన సచిన్ 1741 పరుగులు చేసి ఆల్‌టైమ్ టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.
- జాక్ కలీస్ : సౌతాఫ్రికా వెటరన్ ప్లేయర్ జాక్ కలీస్ ఈ లిస్ట్‌లో రెండో స్థానంలో ఉన్నాడు. అతడు 1734 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో సచిన్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో కలీస్ రెండో ప్లేస్‌లో నిలిచాడు.
- హషీమ్ ఆమ్లా : సౌతాఫ్రికా మాజీ బ్యాటర్ హషీమ్ ఆమ్లా భారత్- సౌతాఫ్రికా టెస్టు మ్యాచ్‌ల్లో నిలకడగా రాణించాడు. 21 మ్యాచ్‌లు ఆడిన ఆమ్లా 43.65 సగటుతో 1528 పరుగులు బాదాడు.
- ఏబీ డివిలియర్స్ : 360 డిగ్రీల ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఈ లిస్ట్‌లో నాలుగో స్థానంలో ఉన్నాడు. భారత్‌తో 20 టెస్టులు ఆడిన ఏబీ డివిలియర్స్ 1334 పరుగులు చేశాడు.
- వీరేంద్ర సేహ్వాగ్ : టీమ్ఇండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సేహ్వాగ్ సౌతాఫ్రితా టెస్టుల్లోనూ ఘనమైన రికార్డులు నెలకొల్పాడు. అతడు సఫారీలతో 15 టెస్టుల్లో ఆడాడు. అందులో 1306 పరుగులు నమోదు చేశాడు.
- రాహుల్ ద్రవిడ్ : టీమ్ఇండియా ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సౌతాఫ్రికాతో 21 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అందులో రాహుల్ 1252 పరుగులు సాధించాడు. దీంతో అత్యధిక పరుగుల జాబితాలో రాహుల్ ఆరో స్థానంలో ఉన్నాడు.
- విరాట్ కోహ్లీ : స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒక్కడే ప్రస్తుత టీమ్ఇండియా నుంచి ఈ లిస్ట్‌లో ఉన్నాడు. విరాట్ సౌతాఫ్రికాతో 14 టెస్టు మ్యాచ్‌ల్లో ఆడాడు. అందరికంటే అత్యధిక సగటు (56.18)తో 1236 పరుగులు సాధించాడు.