Highest Chasings in Asia Cup : క్రికెట్లో టీ-20 ఫార్మాట్ ప్రారంభమైన తర్వాత ఈ ప్రభావం వన్డే, టెస్టులపై కూడా పడింది. ఫార్మాట్ ఏదైనా బ్యాటర్లు.. బంతిని బౌండరీ దాటించడమే లక్ష్యంగా పెట్టుకొని ఆడుతున్నారు. ఈ క్రమంలో వన్డేల్లో సైతం దూకుడుగా అడుతూ.. తమ జట్లకు భారీ స్కోర్లు అందిస్తున్నారు. దీంతో అప్పుడప్పడూ వన్డేల్లో 400+ పరుగులు సాధించి.. ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నారు. అయితే అంతటి పెద్ద పెద్ద టార్గెట్లను కూడా అంతర్జాతీయ క్రికెట్లో ఆయా జట్లు ఛేదిస్తున్నాయి. అలా ఆసియా కప్ చరిత్రలో వన్డే ఫార్మాట్లో ఇప్పటివరకూ జరిగిన కొన్ని విజయవంతమైన ఛేజింగ్‌లు ఎంటో తెలుసుకుందాం.
1. ఇండియా వర్సెస్ పాకిస్థాన్..
2012 ఆసియా కప్ భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ఈ లిస్ట్‌లో టాప్ పొజిషన్లో ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఏకంగా.. 330 పరుగుల టార్గెట్‌ను ఛేదించింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో (183* : 148 బంతుల్లో 22x6; 1x6) కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్‌తో భారత్ 47.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. విరాట్‌తో పాటు సచిన్ తెందూల్కర్ (52), రోహిత్ శర్మ(68) హాఫ్ సెంచరీలతో రాణించారు.
మొదటగా విరాట్, సచిన్‌తో కలిసి రెండో వికెట్‌కు 133 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇక సచిన్ ఔటైన తర్వాత.. విరాట్, రోహిత్ కలిసి మూడో వికెట్‌కు 172 పరుగులు జోడించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాక్.. మహ్మద్ హఫీజ్ (105), నాసిర్ జంషెడ్ (112) శతకాలతో చెలరేగి.. జట్టుకు 329 పరుగుల భారీ స్కోర్ అందించారు.
2. పాకిస్థాన్ వర్సెస్ బంగ్లాదేశ్
2014 ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రెండో అత్యధిక ఛేజింగ్ నమోదైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా.. 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసి పాక్ ముందు భారీ టార్గెట్‌ను ఉంచింది. అనంతరం ఛేదనలో అహ్మద్ షెహ్జాద్ (103), మహమ్మద్ హఫీజ్ (52) తొలుత రాణించగా.. చివర్లో ఫవాద్ ఆలం (74), షహీద్ అఫ్రిదీ (59 పరుగులు : 25 బంతుల్లో; 2x4, 7x6) చెలరేగడం వల్ల పాకిస్థాన్ 49.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి.. విజయతీరాలకు చేరుకుంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా బ్యాటర్లలో ఓపెనర్ అనముల్ హక్ (100)తో పాటు.. టాపార్డర్‌లో ఇమ్రుల్ కైస్ (59), మోమినుల్ హక్ (51), ముష్ఫికర్ రహీమ్ (51) అర్ధ శతకాలతో రాణించడం వల్ల బంగ్లా భారీ స్కోర్ చేయగలిగింది.