Heinrich Klaasen World Cup 2023 : హెన్రిచ్ క్లాసెన్.. క్రికెట్ లవర్స్ అందరూ ఇప్పుడు తలుచుకుంటున్న ఒకే ఒక పేరు. దక్షిణాఫ్రిక జట్టులోని మేటి ప్లేయరైన క్లాసన్.. ఓ బ్యాటర్‌గానే కాకుండా ఓ వికెట్‌కీపర్‌గానూ రాణిస్తూ ఎన్నో విధ్యంసకర ఇన్నింగ్స్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. బాదితే బాల్ బౌండరీకి పోవాల్సిందే.. ప్రత్యర్థులకు చుక్కలు కనిపించాల్సిందే అంటూ మెలికలు తిప్పే స్పిన్నర్లను సైతం ముప్పతిప్పలు పెడుతున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన అతను.. 83 బంతుల్లోనే 174 పరుగులు చేసి సౌతాఫ్రికా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అందరి దృష్టి ఒక్కసారిగా క్లాసెన్‌పై పడింది. సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు ఈ ప్లేయర్‌పై ప్రశంసల జల్లును కురిపిస్తన్నారు. ఇక రానున్న ప్రపంచ కప్ నేపథ్యంలో క్లాసెన్ దక్షిణాఫ్రికాకు కీలకం కానున్నాడు. దీంతో స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లు ఉండే భారత గడ్డపై అతని ప్రదర్శన ఏ మేర ఉండనుందో అంటూ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
అందరూ అలా.. క్లాసెన్ ఇలా..
Heinrich Klaasen Australia Series : స్పిన్‌ను ఎదుర్కొనే విషయంలో విదేశీ బ్యాటర్లు సాధారణంగా తడబడుతుంటారు. కానీ క్లాసెన్ స్టయిలే వేరు. స్పిన్నర్ల బంతులను అలవోకాగా బౌండరీలు దాటించడం అతనికి ఎంతో సులువు. పిచ్‌పై బంతి పడి తిరిగి తిరగకముందే అందుకుని దాన్ని సిక్సర్‌గా మలచడంలో దిట్ట. ఇక అరంగేట్రం నుంచి ఇప్పటి వరకు స్పిన్నర్లపై క్లాసెన్ తన ఆధిపత్యాన్ని చూపిస్తూనే ఉన్నాడు. దీనికి తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డే కూడా ఓ ఉదాహరణ. ఆ మ్యాచ్‌లో ఆసీస్ స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా బౌలింగ్‌లో విరుచుకుపడ్డాడు. అయితే క్లాసెన్ దెబ్బకు విలవిల లాడిన జంపా.. వన్డేల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న బౌలర్‌గా రికార్డుకెక్కిన లూయిస్ సరసన నిలవాల్సి వచ్చింది. ఈ ఇన్నింగ్స్‌లో క్లాసెన్ 13 సిక్సులు బాదితే అందులో 6 జంపా బౌలింగ్‌లోనే కావడం గమనార్హం.
జంపానే కాదు చాహల్ కూడా..
Heinrich Klaasen vs Chahal : ఆడమ్ జంపాకు ఎదురైన అదే అనుభవం భారత స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు కూడా ఎదురైంది. 2018లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత జట్టు మెరుగైన ప్రదర్శనే చేసినప్పటికీ.. మన బౌలర్లను మాత్రం క్లాసెన్ కలవరపెట్టాడు. పవర్ హిట్టింగ్‌తో భారత స్పిన్నర్లను ముప్పతిప్పలు పెట్టిన అతను.. రెండో టీ20లో 30 బంతుల్లోనే 69 పరుగులు చేసి జట్టును విజయపథంలోకి నడిపించాడు. ఈ క్రమంలో లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో 12 బంతుల్లోనే 41 పరుగులు పిండుకున్నాడు.