టీమ్‌ఇండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఇంకా 21 ఏళ్ల కుర్రాడని, ప్రశాంతంగా ఉంటూనే వైఫల్యాల నుంచి నేర్చుకోవాలని దిగ్గజ బ్యాట్స్‌మన్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. గతేడాది ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌ల్లో 440 పరుగులు చేసిన అతడు ఈసారి టోర్నీ వాయిదా పడకముందు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 132 పరుగులే చేశాడు. దీంతో అతడిపై ఒత్తిడి పెరిగిందని గావస్కర్ ఓ క్రీడా ఛానల్‌తో అన్నాడు.
'గిల్ ప్రశాంతంగా ఉండు.. అన్నీ సర్దుకుంటాయ్' - శుభ్‌మన్ గిల్
ఈ దఫా ఐపీఎల్‌లో విఫలమైన యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌పై స్పందించాడు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్. అతడింకా 21 ఏళ్ల కుర్రాడేనని.. ఆటలో భాగంగా వైఫల్యాలను అధిగమిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
"గిల్ ఇలా ఉన్నపళంగా విఫలమవ్వడానికి కారణం నాకు తెలిసి అంచనాలు పెరిగి ఒత్తిడికి గురవ్వడమే. ఐపీఎల్ కన్నా ముందు పరిస్థితులు వేరు. అతడో నమ్మకమైన యువ బ్యాట్స్‌మన్‌గా ఉన్నాడు. అయితే, ఆస్ట్రేలియా పర్యటనలో అతడి ఆట చూశాక బాగా ఆడతాడనే అంచనాలు పెరిగాయి. ఆ ఒత్తిడి కారణంగానే ఇలా విఫలమవుతున్నాడని అనిపిస్తోంది. అతడిప్పుడు ప్రశాంతంగా ఉండాలి. ఇంకా 21 ఏళ్ల కుర్రాడే. ఎవరికైనా వైఫల్యాలు ఉంటాయి. వాటి నుంచి నేర్చుకోవాలి. అతడు ఓపెనింగ్ చేస్తూ దేని గురించి ఆలోచించకుండా స్వేచ్ఛగా ఆడాల్సి ఉంది. సహజసిద్ధమైన ఆట ఆడితే పరుగులవే వస్తాయి" అని గావస్కర్ వివరించాడు.