వచ్చే ఇంగ్లాండ్ పర్యటనలో టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తాడని పాకిస్థాన్ మాజీ బ్యాట్స్‌మన్ సల్మాన్ బట్ ధీమా వ్యక్తం చేశాడు. కోహ్లీ మూడంకెల స్కోర్ అందుకోక దాదాపు రెండేళ్లు కావొస్తోంది. అతడి కెరీర్‌లో ఇంత వ్యత్యాసం రావడం ఇదే తొలిసారి. 2019 నవంబర్‌లో చివరిసారి బంగ్లాదేశ్‌పై టెస్టు మ్యాచ్‌లో శతకం సాధించాడు. దాంతో అంతర్జాతీయ క్రికెట్‌లో 70వ సారి ఆ ఘనత నమోదు చేశాడు. అప్పటి నుంచీ కోహ్లీ మరో శతకం బాదలేదు. ఈ నేపథ్యంలోనే సల్మాన్ తాజాగా తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ భారత సారథిపై ప్రశంసలు కురిపించాడు.
'తర్వాతి మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ పక్కా' - kohli latest news
టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీ, తర్వాతి మ్యాచ్‌లో లేదా ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో కచ్చితంగా శతకం చేస్తాడని పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ బట్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే 70 అంతర్జాతీయ సెంచరీలతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు విరాట్.
!['తర్వాతి మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ పక్కా' He can do it in next match itself: Salman Butt opines Virat Kohli can end his century drought soon](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11864497-321-11864497-1621742983676.jpg)
'కోహ్లీ ఇప్పటికే అనేక రికార్డులు బద్దలుకొట్టాడు. ఈ వయసులో ఒక ఆటగాడు 70 శతకాలు సాధిస్తాడని ఎవరైనా ఊహించారా? ఇప్పుడు అతడున్నంత ఫిట్‌నెస్‌తో ఎవరైనా ఉంటారని అనుకున్నారా? లేదా అతడున్న ఫామ్ గురించి ఆలోచించారా? ప్రస్తుతం కోహ్లీ ఛేదనల్లో 90 స్ట్రైక్‌రేట్‌తో ఉన్నాడు. అన్ని ఫార్మాట్లలో 50కి పైగా సగటుతో కొనసాగుతున్నాడు. ఇప్పటికే ఎన్నో ఘనతలు సాధించాడు. ఇంకో శతకం సాధిస్తే ఎవరు అడ్డుకుంటారు? నిజం చెప్పాలంటే అతడు ఆడే తర్వాతి మ్యాచ్‌లోనైనా లేదా ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లోనైనా కచ్చితంగా సెంచరీ కొడతాడు. ఏడాదికి పైగా సెంచరీ సాధించకపోయినా అతడు చేసిన పరుగులు చూడండి మీకే అర్థమవుతుంది. కోహ్లీ సెంచరీ కొట్టకపోతే అసలు పరుగులే చేయలేదని మనం అనుకుంటాం. మరో శతకం కొట్టడానికి అవసరమైన అవకాశాలు మెండుగా ఉన్నాయి. అది కేవలం సమయంతో ముడిపడి ఉంది' అని సల్మాన్ తన అభిప్రాయాలు వెల్లడించాడు.
ఇది చదవండి:ఐపీఎల్ మిగతా మ్యాచ్‌లు అప్పుడే, అక్కడే?