HCA News: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) పరిపాలన వ్యవహారాల పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు చేస్తామన్న సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామని హెచ్‌సీఏ ఎపెక్స్ కౌన్సిల్ సభ్యులు ప్రకటించారు. అయితే హెచ్‌సీఏ నియమావళి (బై లాస్) ప్రకారం సంఘాన్ని సీఈఓ నిర్వహిస్తారని తెలిపారు. సుప్రీంకోర్టు నియమించే కమిటీ పర్యవేక్షణలో సీఈఓ హెచ్‌సీఏ కార్యకలాపాలు కొనసాగిస్తారని పేర్కొన్నారు. ఈమేరకు కార్యదర్శి విజయానంద్, జాన్ మనోజ్, సురేందర్ అగర్వాల్, నరేశ్‌శర్మ, అనురాధ గురువారం ప్రకటన విడుదల చేశారు.
"గత ఏడాది కాలంగా అనేక సమస్యలపై హెచ్‌సీఏ ఎపెక్స్ కౌన్సిల్‌లో విభేదాలు ఉన్నాయి. ఎపెక్స్ కౌన్సిల్‌ను రద్దు చేస్తూ.. హెచ్‌సీఏ పరిపాలనను రిటైర్డ్ జడ్జిల కమిటీకి అప్పగిస్తూ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్‌వీ రమణ తీర్పు వెలువరించారు. హెచ్‌సీఏ నియమావళి ప్రకారం కమిటీ పర్యవేక్షణలో సీఈఓ కార్యకలాపాలు నిర్వహిస్తారు. సుప్రీంకోర్టు తీర్పును మేం పూర్తిగా గౌరవిస్తాం" అని ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఎపెక్స్ కౌన్సిల్ సభ్యుల ప్రకటనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ విచారిస్తున్న కేసులో ఎవరు ఏం చేయాలి? ఎవరి విధులు ఏంటి? అని ఎపెక్స్ కౌన్సిల్ సభ్యులు పేర్కొనడం సరికాదని క్లబ్‌ల కార్యదర్శులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం సీఈఓగా ఉన్న సునీల్ కాంటే నియామకంపై హెచ్‌సీఏలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌తో సంబంధం లేకుండా మిగతా సభ్యులంతా కలిసి సునీల్‌ను సీఈఓగా నియమించారన్న విమర్శలూ ఉన్నాయి. అత్యున్నత న్యాయస్థానం ఏర్పాటు చేసే కమిటీ పర్యవేక్షణలో తాము నియమించిన సీఈఓ హెచ్‌సీఏ కార్యకలాపాలు నిర్వహిస్తాడని ఎపెక్స్ కౌన్సిల్ సభ్యులు పేర్కొనడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని ఆరోపిస్తున్నారు.