Hasan Raza Sensational Comments On BCCI :వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమ్ఇండియాపై సెన్సెషనల్ కామెంట్స్ చేశాడు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ హసన్ రజా. బీసీసీఐ, ఐసీసీ ఇద్దరు కలిసి భారత బౌలర్లకు స్పెషల్ బాల్స్ అందిస్తున్నారంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. అందుకే టీమ్ఇండియా పేసర్లు, స్పిన్నర్లు మైదానంలో ఈ రకంగా చెలరేగిపోతున్నారు అంటూ పాక్‌కు చెందిన ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడు. ఈ వ్యవహారంపై ఐసీసీ విచారణ జరిపించాలని సూచించాడు ఈ మాజీ ఆటగాడు.
"భారత్ వేదికగా జరుగుతున్న 2023 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా మ్యాచ్‌లు, వరుసగా వారు సాధిస్తున్న విజయాలు చూస్తుంటే బహుశా థర్డ్ అంపైర్ లేదా బీసీసీఐ లేదా ఐసీసీ భారత బౌలర్లకు స్పెషల్ బాల్స్ ఇస్తుందా అని అనిపిస్తుంది. ఇదంతా నాకో చీటింగ్లా అనిపిస్తుంది. మిగతా జట్ల బౌలర్లతో పోలిస్తే భారత బౌలర్లకు ఎక్కువ స్వింగ్ లభిస్తోంది. డీఆర్ఎస్, ఎల్బీడబ్ల్యూ నిర్ణయాలు కూడా టీమ్ఇండియాకు అనుకూలంగా వస్తున్నాయి. దీనిపై ఐసీసీ విచారణ జరిపించాలి."
- హసన్ రజా, పాక్ మాజీ ఆటగాడు
ఫ్యాన్స్ ఫైర్..
మరోవైపు హసన్ రజా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధం ఎదుర్కొంటున్న హసన్ రజా బీసీసీఐ చీటింగ్ చేస్తుందంటూ వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందని కొందరు క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతుంటే మరికొందరు జోక్స్ వేస్తున్నారు. 'భారత్ సాధిస్తున్న వరుస విజయాలు హసన్ రజాకు మింగుడుపడటం లేదనుకుంటా, పాక్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది' అంటూ ఓ నెటిజెన్ కామెంట్ చేశాడు.