Riyan parag Vs Harshal patel: రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లో రియాన్ పరాగ్, హర్షల్ పటేల్ గొడవ చర్చనీయాంశమైంది. మాటలతో మొదలైన ఈ వివాదం దాదాపు కొట్టుకునే స్థాయి వరకు చేరింది.
ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ప్లేయర్ రియాన్ పరాగ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 31 బంతుల్లో 56 పరుగులు చేసిన అతడు.. హర్షల్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్ సహా మొత్తం 18 రన్స్ చేశాడు. అయితే ఆఖరి బంతికి డీప్ మిడ్‌వికెట్ మీదగా అదిరిపోయే సిక్స్ కొట్టాడు. దీంతో హర్షల్.. పరాగ్ వైపు కోపంగా చూస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. పరాగ్ కూడా హర్షల్‌కు కౌంటర్ వేశాడు. అలా ఇద్దరి మధ్య మాటమాట పెరిగి ఒకరిపై ఒకరు దూసుకొచ్చారు.
వెంటనే అక్కడే ఉన్న చాహల్ మధ్యలోకి వెళ్లి పరాగ్‌ను దూరంగా తీసుకెళ్లగా.. ఆర్సీబీ ప్లేయర్స్ కూడా హర్షల్‌ను పక్కకు తీసుకెళ్లి కూల్ చేశారు. దీంతో వివాదం ముగిసింది. కానీ మ్యాచ్ ముగిసిన తర్వాత వీరిద్దరు గొడవకు ముగింపు పలకలేదని అర్ధమైంది.
సాధారణంగా మ్యాచ్ పూర్తైన తర్వాత ఇరు జట్లు ఆటగాళ్ల షేక్‌హ్యాండ్ ఇచ్చుకోవడం ఆనవాయితీ. గొడవపడినా ఆటగాళ్లు కూడా సారీ చెప్పుకుంటారు. కానీ హర్షల్ మాత్రం అలా చేయలేదు. పరాగ్ వచ్చి షేక్‌హ్యాండ్ ఇవ్వాలని ప్రయత్నించినప్పటికీ.. అతడు కనీసం మొహం కూడా చూడలేదు. మరో ఆటగాడికి షేక్‌హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆ తర్వాత కాసేపటి ఆ వీడియోను సోషల్‌మీడియా నుంచి తొలిగించారు.
కాగా, ఈ మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో విజయం సాధించింది రాజస్థాన్. ఆర్ఆర్ నిర్దేశించిన 145 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలో బెంగళూరు 115 పరుగులకే ఆలౌటైంది. డుప్లెసిస్ (23) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. బెంగళూరు బ్యాటర్లలో విరాట్ కోహ్లీ 9, రాజత్ పాటిదార్ 16, షాహ్‌బాజ్ అహ్మద్ 17, వహిండు హసరంగ 18, దినేశ్ కార్తిక్ 6, సిరాజ్ 5, హర్షల్ పటేల్ 7 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో కుల్‌దీప్ సేన్ 4, రవిచంద్రన్ అశ్విన్ 3, ప్రసిధ్ కృష్ణ 2 వికెట్లు తీశారు.
ఇదీ చూడండి: IPL 2022: ముంబయి ఇండియన్స్ @9967 కోట్లు!