ఇంగ్లాండ్ యంగ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ టెస్టు క్రికెట్లో సంచనాలు సృష్టిస్తున్నాడు. తాజాగా మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో బ్రూక్ హ్యారీ 169 బంతుల్లో 184 పరుగుల చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలోనే 145 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో ఎనిమిది వందలకుపైగా పరుగులు సాధించిన బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు. అలా 807 రన్స్ చేశాడు. ఇప్పటివరకు అతడు ఆరు టెస్టుల్లో తొమ్మిది ఇన్నింగ్స్‌లు ఆడి నాలుగు సెంచరీలు బాదాడు. ఇక ఈ టెస్టుల్లో అతడు వందకుపైగా(100.88) సగటుతో కొనసాగుతుండటం విశేషం. ఇప్పటి వరకు మొదటి తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక రన్స్ సాధించిన బ్యాటర్‌గా టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ (798) పేరిట రికార్డ్ ఉండేది. ఆ తర్వాత హెర్బర్ట్ సుట్ల్కిఫ్ (780), సునీల్ గావస్కర్ (778), ఎవర్టన్ వీకెస్ను(777) బ్రూక్ అధిగమించాడు.
బ్రూక్ ఇన్నింగ్స్
- బ్రూక్ 2022, సెప్టెంబర్ 8న దక్షిణాఫ్రికాపై టెస్ట్ అరంగేట్రం చేశాడు. మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 12 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో అతడికి బ్యాటింగ్ అవకాశం రాలేదు.
- ఆ తర్వాత పాకిస్థాన్ పర్యటనలో మంచి ప్రదర్శన చేశాడు. అక్కడ ఆడిన ఫస్ట్ టెస్టులోనే 153, 87 పరుగులు చేశాడు. అనంతరం రెండు, మూడు టెస్టుల్లోనూ మరో రెండు శతకాలు బాదాడు.
- ఇక న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో 89, 54 పరుగులు చేశాడు. ప్రస్తుతం రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 184 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అలా టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి తొమ్మిది ఇన్నింగ్స్ లో కలిపి ఇప్పటి వరకూ బ్రూక్ రన్స్ 807 రన్స్ చేశాడు.