Harmanpreet Kaur Australia Series :వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక టెస్టులో భారత మహిళలు చెలరేగిపోయారు. 75 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించి విజయ తీరాలకు చేరుకున్నారు. దీంతో క్రికెట్ లవర్స్ సంబరాలు చేసుకుంటోంది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది. దీని కారణంగా ఇరు జట్ల కెప్టెన్ల మధ్య వాడి వేడిగా వాగ్వాదం సాగింది.
ఇంతకీ ఏం జరిగిందంటే ?
హర్మన్ ప్రీత్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఆస్ట్రేలియా ప్లేయర్ అలిస్సా హీలి (32) క్రీజులో ఉంది. అయితే ఆమె క్రీజు వదిలి ముందుకు వచ్చి డిఫెండ్ చేసింది. ఇంతలోపే బాల్‌ను అందుకున్న హర్మన్ ప్రీత్ రనౌట్ చేయాలన్న ఉద్దేశంతో త్రోను విసిరింది. అయితే ఆ బాల్‌ను అలిస్సా హీలి తన బ్యాటుతో అడ్డుకుంది. దీంతో ఆక్రోశం చెందిన హర్మన్ 'అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్' అంటూ అంపైర్‌కు అపీల్ చేసింది. కానీ ఆ అంపైర్లు హర్మన్ అపీల్‌ను తిరస్కరించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే తర్వాతి బంతికే హీలిని హర్మన్ ఔట్ చేసింది. కాసేపటికే ఆ గొడవ సద్దుమణిగింది. అయితే దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
మ్యాచ్ సాగిందిలా
India Vs Australia Womens Test :టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 219 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ మూనీ (40), తాహిళ మెక్ గ్రాత్ (50), కెప్టెన్ హీలీ (38) మాత్రమే రాణించారు. చివర్లో కిమ్ గార్త్ (28) పర్వాలేదనిపించింది. ఇక భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్ 4, స్నేహ్ రాణా 3, దీప్తి శర్మ 2 వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను దెబ్బతీశారు.