Hardik Pandya World Cup 2023 : వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్ - బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య గాయపడ్డాడు. అయితే తాజాగా అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో అక్టోబర్ 22న ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో జరగనున్న మ్యాచ్‌కు దూరమయ్యాడు. స్కానింగ్ అనంతరం ఇప్పుడు హార్దిక్ విశ్రాంతి కోసం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్నాడు. వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్న అతను.. పూర్తిగా కోలుకున్నాక లఖ్‌నవూ వేదికగా ఇంగ్లాండ్‌తో జరగనున్న మ్యాచ్‌కు హాజరుకానున్నాడు.
అసలేం జరిగింది :
ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో ఈ ఘటన జరిగింది. మూడో బాల్ వేస్తున్న సమయంలో బంగ్లా ప్లేయర్ లిటన్ దాస్.. ఓ సూపర్ స్ట్రైట్ డ్రైవ్‌ను కొట్టాడు. ఇది గమనించిన హార్దిక్.. ఆ బాల్‌ను తన కుడి కాలితో ఆపేందుకు ప్రయత్నించాడు. దీంతో అనుకోకుండా అతను కింద పడ్డాడు. అయితే లేచి నిల్చునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో హార్దిక్ కాస్త ఇబ్బంది పడ్డాడు. దీంతో ఫిజియో సిబ్బంది వచ్చి అతడ్ని పెవిలియన్‌కు తీసుకెళ్లారు. అయితే హార్దిక్ అప్పటికే తొమ్మిదో ఓవర్లో 3 బంతులు వేయగా.. మిగిలిన ఓవర్‌ను విరాట్ కోహ్లీ పూర్తి చేశాడు. ఈ క్రమంలో హార్దిక్ స్థానంలో ఫీల్డింగ్‌లోకి సూర్యకుమార్ యాదవ్‌ను దింపారు.
అతడు దూరమైతే..: గాయం కారణంగా హార్దిక్ పాండ్య దూరమైతే అది టీమ్‌ఇండియాకు పెద్ద దెబ్బే. గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న హార్దిక్.. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో రాణిస్తూ ఆల్‌రౌండర్ పాత్రను సమర్థంగా పోషిస్తున్నాడు. బ్యాటింగ్‌లో ఇప్పటివరకూ టాప్‌ఆర్డర్ రాణించడం వల్ల హార్దిక్ పెద్దగా కష్టపడాల్సిన పనిలేకుండా పోయింది. ఒకవేళ టాప్‌ఆర్డర్ విఫలమైతే మిడిలార్డర్‌లో హార్దిక్ లాంటి బ్యాటర్ అవసరం జట్టుకు ఉంటుంది. బౌలింగ్‌లోనూ హార్దిక్ భారత్‌కు ఎంతో అవసరం.