India Pakistan match Hardik Pandya : హార్దిక్ పాండ్య సత్తా ఎలాంటిదో.. తన సామర్థ్యానికి అతను పూర్తిగా న్యాయం చేస్తే ఫలితం ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ మ్యాచ్ రుజువు. నిఖార్సయిన ఆల్‌రౌండర్ అన్న మాటకు అతను నిర్వచనం చెప్పాడీ మ్యాచ్‌తో. మొదట పాక్ ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు (4) తీసింది భువనేశ్వరే కానీ.. భారత బౌలర్లలో హీరో మాత్రం హార్దిక్ పాండ్యనే. మ్యాచ్‌ను మలుపు తిప్పే బౌలింగ్ ప్రదర్శన అతడిదే. రిజ్వాన్, ఇఫ్తికార్‌ల మధ్య భాగస్వామ్యం ప్రమాదకరంగా మారుతున్న సమయంలో.. ఇఫ్తికార్‌ను ఔట్ చేసి భారత్‌కు అతను ఉపశమనాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఒకే ఓవర్లో రిజ్వాన్, ఖుష్‌దిల్ షాల వికెట్లు పడగొట్టి పాక్ పెద్ద స్కోరు చేయకుండా అడ్డు పడ్డాడు.
పేసర్లకు అనుకూలిస్తున్న పిచ్‌ను హార్దిక్ చాలా బాగా ఉపయోగించుకున్నాడు. షార్ట్ పిచ్ అస్త్రాన్ని అతను బాగా వాడుకుని పాక్‌ను దెబ్బ తీశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ హార్దిక్ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. గెలిపించేలా కనిపించిన సూర్యకుమార్ ఔటైపోయి, సాధించాల్సిన రన్‌రేట్ పెరిగిపోతున్న సమయంలో క్రీజులో అడుగు పెట్టిన అతను.. తీవ్ర ఒత్తిడిలో గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో అతను సిక్సర్‌తో మ్యాచ్ గెలిపించిన దృశ్యం చాన్నాళ్లు అభిమానుల మనసుల్లో నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.
కోహ్లీ మళ్లీ..
టన్నుల కొద్దీ పరుగులు, మంచినీళ్ల ప్రాయంగా శతకాలు, రికార్డుల మీద రికార్డులు.. ఇలా అప్రతిహతంగా సాగిన విరాట్ కోహ్లీ ప్రయాణం కొంత కాలంగా ఒడుదొడుకులకు గురవుతోంది. పరుగుల లేమితో సతమతం అవుతున్న విరాట్.. శతకం కోసం సుదీర్ఘ కాలంగా నిరీక్షిస్తున్నాడు. ఆసియా కప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ కొడతాడని ఎందరో అభిమానులు వేచి చూశారు.