Hardik Pandya Fitness: కొన్ని నెలలుగా వెన్నునొప్పితో బాధపడుతున్న టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఫిట్‌నెస్ నిరూపించుకుంటేనే దక్షిణాఫ్రికా పర్యటనలో అతడికి చోటు కల్పించనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఎన్సీఏలో (National Cricket Academy)లో ఫిట్‌నెస్ నిరూపించుకునే దానిపైనే హార్దిక్ ఎంపిక ఆధారపడి ఉందని బీసీసీఐ అధికారులు పేర్కొన్నారు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్‌కు చోటు దక్కినా.. ప్రభావం చూపలేకపోయాడు. దీంతో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కి హర్దిక్‌ను ఎంపిక చేయలేదు.
"హార్దిక్ కోలుకునేందుకు తగినంత విశ్రాంతి అవసరం. దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఇంకా చాలా సమయం ఉంది. ఆలోపు అతడు కోలుకుని.. ఫిట్‌నెస్ నిరూపించుకుంటే దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపిక చేస్తాం. అతడు త్వరలో ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీలో ఆడనున్నాడు. ఆ ట్రోఫీలో ఆడటం కన్నా.. అతడు ఫిట్‌గా ఉండటం మాకు చాలా ముఖ్యం. అయినా ఆడాలనుకుంటే అది అతడిష్టం" అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.