తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఇప్పుడైతే మా టార్గెట్​ ఆటను ఆస్వాదించడమే.. భవిష్యత్తు గురించి తర్వాత మాట్లాడతాం' - మైకెల్​ వాన్​పై హార్దిక్ పాండ్య కామెంట్లు

ప్రపంచకప్​ వైఫల్యం నుంచి తమ జట్టు బయటపడాలని టీమ్‌ఇండియా తాత్కాలిక టీ20 కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య తెలిపాడు. 2024 టీ20 ప్రపంచకప్‌నకు ప్రణాళిక మొదలవుతోందని హార్దిక్‌ అన్నాడు. మరోవైపు, టీమ్‌ఇండియాపై ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌ విమర్శలకు హార్దిక్‌ కౌంటర్ ఇచ్చాడు.

Hardik Pandya
హార్దిక్‌ పాండ్య

By

Published : Nov 17, 2022, 8:10 AM IST

వచ్చే టీ20 ప్రపంచకప్‌ (2024)కు ప్రణాళిక మొదలవుతోందని టీమ్‌ఇండియా తాత్కాలిక టీ20 కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య అన్నాడు. చాలా మంది ఆటగాళ్లకు అవకాశాలు వస్తాయని చెప్పాడు. ప్రపంచకప్‌ వైఫల్యం నుంచి తమ జట్టు బయటపడాలని హార్దిక్‌ అన్నాడు. ఈ నెల 18న న్యూజిలాండ్‌తో మొదలయ్యే టీ20 సిరీస్‌లో అతడు భారత జట్టును నడిపించనున్నాడు.

"ప్రపంచకప్‌ ఫలితంతో జట్టులో నిరాశ ఉన్న విషయం తెలుసు. కానీ మేమంతా ప్రొఫెషనల్‌ ఆటగాళ్లం. వైఫల్యాన్ని జీర్ణించుకోవాలి. లోపాలను సరిదిద్దుకోవాలి" అని హార్దిక్‌ చెప్పాడు. వచ్చే టీ20 ప్రపంచకప్‌ 2024లో వెస్టిండీస్‌, అమెరికాలో జరగనుంది. ఈ నేపథ్యంలో వచ్చే రెండేళ్లలో భారత జట్టులో భారీ మార్పులు జరుగుతాయని భావిస్తున్నారు. "వచ్చే ప్రపంచకప్‌ దాదాపు రెండేళ్ల దూరంలో ఉంది. కొత్త ప్రతిభావంతులను వెలికితీయడానికి మాకు సమయం ఉంది. ఈ లోపు చాలా క్రికెట్‌ జరుగుతుంది. చాలా మందికి చాలినన్ని అవకాశాలు లభిస్తాయి. ఆ ప్రపంచకప్‌కు ఇప్పటి నుంచే మార్గసూచి మొదలవుతుంది. అయితే మాకు చాలా సమయం ఉంది. ఏం చేయాలన్నదానిపై కూర్చుని మాట్లాడతాం. ఇప్పుడైతే మా లక్ష్యం ఆటను ఆస్వాదించడమే. భవిష్యత్తు గురించి తర్వాత మాట్లాడతాం" అని హార్దిక్‌ చెప్పాడు.

వాన్​ విమర్శలకు కౌంటర్​..
టీమ్‌ఇండియాపై ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌ తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగాడు. ఈ అంశంపై తాజాగా హార్దిక్‌ పాండ్యా స్పందించాడు. ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తామని.. అయితే భారత జట్టుకు కొత్తగా రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదంటూ కౌంటర్‌ ఇచ్చాడు.

"మన ప్రదర్శన సరిగా లేనప్పుడు కచ్చితంగా ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తం చేస్తుంటారు. అందులో తప్పేం లేదు. మేం వాటిని గౌరవిస్తాం. కానీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న టీమ్ఇండియా వంటి జట్టు ఈరోజు కొత్తగా ఒకరి దగ్గర రుజువు చేసుకోవలసిందేమి లేదు. ఇది ఒక క్రీడ. ప్రతిసారి మరింత బాగా ఆడగలిగేలా ప్రయత్నించాలి. ఫలితం దానికదే వస్తుంది. మా పొరపాట్లను సరిదిద్దుకునే విధంగా కృషి చేస్తున్నాం. ప్రపంచకప్‌ ఫలితం నిరాశపరిచింది. కానీ మేం ప్రొఫెషనల్‌ ఆటగాళ్లం. జయాపజయాలను సమానంగా స్వీకరిస్తూ ముందుకెళ్లాల్సి ఉంటుంది. తప్పులు సరిదిద్దుకుంటూ మరింత మెరుగవుతాం" అంటూ హర్దిక్‌ పాండ్యా తెలిపాడు.

"వైట్‌బాల్‌ చరిత్రలోనే అత్యంత పేలవమైన జట్టుగా టీమ్‌ఇండియా నిలిచింది. వాళ్లకున్న ప్రతిభకు టీ20 క్రికెట్‌ ఎలా ఆడగలరని నేను ఆశ్చర్యపోయాను. వారి దగ్గర గొప్పగా ఆడేవారున్నారు. కానీ జట్టు ఆర్డర్‌ సరిగా లేదు. లేదంటే పవర్‌ప్లే మొదటి 5 ఓవర్లలోనే ఇంగ్లిష్‌ ఆటగాళ్లను స్థిరపడనిచ్చేవారా? ఆ విషయంపై టీమ్‌ఇండియా దృష్టి పెట్టాల్సిందే"అంటూ మైఖేల్‌ ఇటీవల ఓ మీడియా కథనంలో పేర్కొన్నాడు.

ABOUT THE AUTHOR

...view details