టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై విజయం సాధించడంలో స్టార్ బ్యాటర్ కోహ్లీ, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక పాండ్య కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ శతక భాగస్వామ్యం నిర్మించారు. అయితే మ్యాచ్ అనంతరం విరిద్దరూ ప్రత్యేకంగా ముచ్చటించారు. మ్యాచ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మాట్లాడుకున్నారు.
"హారిస్ బౌలింగ్‌లో విరాట్ కొట్టిన ఆ రెండు సిక్స్‌లు చాలా కీలకం. ఒకవేళ అప్పుడు కొట్టకపోతే మ్యాచ్ దూరమై ఉండేది. నేను చాలాసార్లు సిక్స్‌లు కొట్టాను.. కానీ విరాట్ బాదిన ఇవి మాత్రం చాలా చాలా ప్రత్యేకం. అవే మమ్మల్ని మ్యాచ్ విజయం వైపు నడిపించాయి. చాలా మంది క్రికెటర్లతో ఆడా. అయితే ఇలాంటి రెండు షాట్లు మాత్రం కోహ్లీ తప్పించి మరెవరూ కొట్టినట్లు నాకైతే గుర్తు లేదు. ఇక మ్యాచ్‌లో అత్యుత్తమం ఏంటంటే తీవ్రంగా ఇబ్బందిపడి గెలుపు శిఖరాలకు చేరాం. ఆ అనుభూతి కూడా అద్భుతం. ఛేదన సందర్భంగా మనం ఇద్దరం (కోహ్లీతో) మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయితే ఇక్కడ పాక్ బౌలర్లను తక్కువగా అంచనా వేయకూడదు. వారు చాలా బాగా బౌలింగ్ చేశారు"