ఐపీఎల్ మెగా వేలం (IPL 2022 Mega Auction) నేపథ్యంలో హార్దిక్ పాండ్యను ముంబయి ఇండియన్స్ (Mumbai Indians News) వదులుకుంటుందనే ప్రచారం సాగుతోంది. రెండేళ్ల క్రితం వరకూ బ్యాట్‌తో, బంతితో సత్తాచాటి స్టార్ ఆల్‌రౌండర్‌గా ఎదిగిన హార్దిక్.. 2019లో వెన్నెముక శస్త్రచికిత్స కారణంగా బౌలింగ్ చేయలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో అతణ్ని (Hardik Pandya News) కేవలం స్పెషలిస్ట్ బ్యాటర్‌గానే అయితే ముంబయి అట్టిపెట్టుకోదని తెలుస్తోంది. కెప్టెన్ రోహిత్, బుమ్రా, పొలార్డ్‌తో పాటు నాలుగో ఆటగాడిగా సూర్యకుమార్, ఇషాన్ కిషాన్‌లో ఒకరిని జట్టు కొనసాగించే అవకాశాలున్నాయి.
వేలంలోకి శ్రేయస్..!
మరోవైపు నాయకుడి పాత్ర కోసం శ్రేయస్(Shreyas Iyer News).. దిల్లీ క్యాపిటల్స్‌ను వదిలేస్తాడని సమాచారం. సారథిగా అతను దిల్లీని రెండు సార్లు ప్లేఆఫ్స్‌కు చేర్చాడు. అందులో ఓ సారి ఫైనల్ వరకూ వెళ్లింది. కానీ గాయంతో ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు అతను దూరం కావడం వల్ల జట్టు పంత్‌ను కెప్టెన్‌ను చేసింది. యూఏఈలో మ్యాచ్‌లకు శ్రేయస్ అందుబాటులోకి వచ్చినా.. పంత్‌నే నాయకుడిగా కొనసాగించింది. దీంతో వచ్చే సీజన్‌లోనూ పంతే ఆ జట్టు కెప్టెన్‌గా ఉంటాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరో జట్టుకు నాయకుడిగా కావాలని అనుకుంటున్న శ్రేయస్.. వేలంలోకి వచ్చేందుకు మొగ్గుచూపుతున్నాడని సమాచారం. ఇక వార్నర్, కేఎల్ రాహుల్ కూడా వేలంలో పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి.