Hardik Pandya Injury Replacement :2023 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం పుణె వేదికగా జరిగిన భారత్ - బంగ్లాదేశ్ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య గాయపడిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం చికిత్స పొందుతున్న హార్దిక్.. అక్టోబర్ 20న టీమ్ఇండియా జట్టుతో కలిసి ధర్మశాల వెళ్లలేదని, అతడు నేరుగా లఖ్‌నవూ వేదికగా ఇంగ్లాండ్‌తో తలపడే మ్యాచ్‌లో అందుబాటులో ఉంటాడని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.
అయితే ప్రసుతం ఈ మెగాటోర్నీలో హార్దిక్.. అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో మినహా ఇప్పటివరకూ అతడికి బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాకపోయినా.. బౌలింగ్‌లో అదరగొడుతున్నాడు. జట్టులో నాలుగో పేసర్‌గా సమర్థంగా రాణిస్తున్నాడు. ఇక హార్దిక్ లాంటి మీడియం ఫాస్ట్ ఆల్‌రౌండర్లు క్రికెట్లో చాలా అరుదు. అయితే ఒకవేళ హార్దిక్ పూర్తి టోర్నీకే దూరమైతే టీమ్ఇండియా పరిస్థతి ఏంటి? అతడి స్థానాన్ని ఎవరు భర్తీ చేయనున్నారు?
సూర్యకుమార్/ఇషాన్.. పాండ్య గైర్హాజరీలో అతడికి తగ్గట్టు హిట్టింగ్ ఆడగల సత్తా ఉన్న బ్యాటర్లు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్. ఇక గతనెల జరిగిన ఆసియా కప్‌లో.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఇషాన్ 82 పరుగులతో రాణించిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరిలో ఎవరో ఒకరితో పాండ్య స్థానాన్ని భర్తీ చేయాలంటే.. శార్దూల్‌ను షమీతో రీప్లేస్ చేయక తప్పదు.
అయినప్పటికీ టీమ్ఇండియాకు మరో సమస్య ఎదురుకావచ్చు. ఇషాన్లేదా సూర్య ఎవరో ఒకరు జట్టులోకి వస్తే.. టీమ్ఇండియా ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగే పరిస్థితి ఉంటుంది. అయితే గతమ్యాచ్‌లో హార్దిక్ గాయపడినట్లుగానే.. తర్వాత మ్యాచ్‌లో మరో బౌలర్ ఎవరైనా గాయపడి, గ్రౌండ్ వీడితే టీమ్ఇండియా 50 ఓవర్లు పూర్తి చేయడం కష్టంగా మారుతుంది.