తెలంగాణ

telangana

ETV Bharat / sports

హార్దిక్‌ పాండ్య.. టీ20 ప్రపంచ కప్​లో టీమ్​ఇండియా ఆశాకిరణం - Hardik Pandya news

2022 ఐపీఎల్‌లో అందరూ ఆశ్చర్యపోయి తనవైపు చూసేలా చేశాడు హార్దిక్‌. బ్యాట్స్‌మన్‌గా, బౌలర్‌గా మెరుపులు మెరిపించడమే కాక.. కెప్టెన్‌గానూ సత్తా చాటాడు. ఆ మెరుపులు తాత్కాలికం కాదని రుజువు చేస్తూ అంతర్జాతీయ క్రికెట్లోనూ నిలకడగా రాణిస్తున్నాడు. రాబోయే టీ20 ప్రపంచ కప్​లో టీమ్​ ఇండియా జట్టుకు ఆశా కిరణంగా కనిపిస్తున్నాడు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 19, 2022, 12:20 PM IST

నిఖార్సయిన ఆల్‌రౌండర్‌ ఆట ఎలా ఉండాలో ఇంగ్లాండ్‌ పర్యటనలో చూపించాడు హార్దిక్‌ పాండ్య. ఇంగ్లాండ్‌తో తొలి టీ20లో 51 పరుగులు చేసి, 4/33 గణాంకాలు నమోదు చేసిన అతను.. ఆ జట్టుతో చివరి వన్డేలో 71 పరుగులు సాధించి, బంతితో 4/24 ప్రదర్శన చేశాడు. హార్దిక్‌ ఆల్‌రౌండ్‌ మెరుపుల గురించి చెప్పడానికి ఇంతకంటే రుజువులేం కావాలి. ఇటు బ్యాట్స్‌మన్‌లా, అటు బౌలర్‌గా హార్దిక్‌ ద్విపాత్రాభినయం చేస్తుండడంతో కూర్పు పరంగా జట్టుకు గొప్ప సౌలభ్యం లభిస్తోంది. ఒక బ్యాట్స్‌మన్‌ను లేదా బౌలర్‌ను అదనంగా తీసుకునే అవకాశం దక్కుతోంది. దీని వల్ల జట్టు బలం పెరుగుతోంది. టీ20 ప్రపంచకప్‌ దిశగా భారత్‌కు ఇది ఎంతో మేలు చేసే విషయమే.

ఈ హార్దిక్‌ వేరు:హార్దిక్‌ను ఎప్పుడూ ఒక హిట్టర్‌గానే చూసేవారు అభిమానులు. అయితే ఇప్పుడు అతడిలో ఒక పరిణతి కలిగిన, నిఖార్సయిన బ్యాట్స్‌మన్‌ కనిపిస్తున్నాడు. ఇంతకుముందులా వచ్చీ రాగానే అడ్డదిడ్డంగా షాట్లు ఆడేయట్లేదతను. మంచి బంతులను గౌరవిస్తున్నాడు. క్రీజులో కుదురుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాడు. అదే సమయంలో సమయోచితంగా షాట్లు ఆడుతున్నాడు. వికెట్‌కు అతనిస్తున్న విలువ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. బహుశా ఇది ఐపీఎల్‌ ప్రభావమే కావచ్చు. కెప్టెన్‌గా గుజరాత్‌ను నడిపించే క్రమంలో బాధ్యతాయుతంగా ఆడడం, టాప్‌ఆర్డర్లో బ్యాటింగ్‌ చేస్తూ ఎక్కువ సేపు క్రీజులో నిలవడం అతడికి కలిసొచ్చింది. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లోనూ అదే తరహాలో బ్యాటింగ్‌ చేస్తున్నాడు.

ఆ అస్త్రంతో..:షార్ట్‌ పిచ్‌ బంతులతో ప్రత్యర్థి బౌలర్లు భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టడం ఎప్పుడూ చూసే దృశ్యమే. కానీ ఇప్పుడు అదే అస్త్రాన్ని ప్రత్యర్థుల మీదికి సమర్థంగా సంధించి ఫలితాలు రాబడుతున్నాడు హార్దిక్‌. ఇంగ్లాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌ల్లో అతను ఈ బంతులతోనే ఆతిథ్య జట్టు బ్యాట్స్‌మెన్‌కు చెక్‌ పెట్టాడు. ముఖ్యంగా చివరి వన్డేలో అతనిచ్చిన షాక్‌లను ఇంగ్లిష్‌ జట్టు అంత సులువుగా మరిచిపోలేదు. స్టోక్స్‌ లాంటి విధ్వంసక బ్యాట్స్‌మన్‌ అతడి షార్ట్‌ బంతులు ఆడలేక అసహనానికి గురై ఔటైన తీరు హార్దిక్‌ ఎంత తెలివిగా బౌలింగ్‌ చేస్తున్నాడో చెప్పడానికి రుజువు. ఇక జట్టుకు చాలా అవసరమైన స్థితిలో వికెట్లు తీస్తూ పాండ్య ఆపద్బాంధవుడి పాత్ర పోషిస్తుండడం కూడా గమనార్హం. చివరి వన్డేలో రాయ్‌, స్టోక్స్‌ భాగస్వామ్యం బలపడుతున్నపుడు స్వల్ప వ్యవధిలో వాళ్లిద్దరినీ ఔట్‌ చేశాడు.

తర్వాత లివింగ్‌స్టోన్‌, బట్లర్‌ చెలరేగిపోతున్న సమయంలో వాళ్లిద్దరినీ ఒకే ఓవర్లో పెవిలియన్‌ చేర్చాడు. హార్దిక్‌ మళ్లీ బౌలింగ్‌ చేసి కాస్త ప్రధాన పేసర్లకు అండగా నిలిస్తే చాలనుకుంటే.. అతను అంచనాలను మించిపోతూ వారికి దీటుగా ప్రదర్శన చేస్తుండడం అభిమానులకు అమితానందాన్నిస్తోంది. ప్రస్తుత ఇంగ్లాండ్‌ పర్యటనలోనే హార్దిక్‌ టీ20లు, వన్డేల్లో తన అత్యుత్తమ ప్రదర్శన (4/33, 4/24) నమోదు చేయడం విశేషం. టీ20 ప్రపంచకప్‌లోనూ అతను బ్యాటుతో, బంతితో ఇదే జోరును కొనసాగిస్తే, మిగతా ఆటగాళ్లూ అంచనాలకు తగ్గట్లు రాణిస్తే ట్రోఫీ కోసం సుదీర్ఘంగా సాగుతున్న నిరీక్షణ ఫలించబోతున్నట్లే.

ఇదీ చదవండి:ఇద్దరు విండీస్​ స్టార్​ క్రికెటర్లు రిటైర్మెంట్

ABOUT THE AUTHOR

...view details