కొత్త సంవత్సరంలో శ్రీలంకపై టీ20 సిరీస్‌ను గెలిచి టీమ్‌ఇండియా శుభారంభం చేసింది. తొలిసారి స్వదేశంలో భారత జట్టుకు నాయకత్వం వహించి సిరీస్‌ను గెలవాలనే హార్దిక్ పాండ్య కల నెరవేరింది. అలాగే 'మిషన్ - 2024'లో తొలి అడుగు ఘనంగా ముందుకు పడింది. దీనికి ప్రధాన కారణం.. సూర్యకుమార్ యాదవ్. తొలి టీ20 మినహా మిగతా రెండింట్లోనూ అదరగొట్టేశాడు. మరీ ముఖ్యంగా మూడో టీ20 మ్యాచ్‌లో అయితే ఉగ్రరూపం చూపించాడు. సెంచరీ బాది సునామీ సృష్టించాడు. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకొంది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత సూర్యకుమార్ బ్యాటింగ్‌ను భారత కెప్టెన్ హార్దిక్ పాండ్య ప్రశంసలతో ముంచెత్తాడు.
'నేనే బౌలర్‌నైతే సూర్యకుమార్ బ్యాటింగ్‌కు హడలెత్తేవాడిని' - భారత్ vs శ్రీలంక మూడో టీ20 హార్దిక్ పాండ్య
శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. ముఖ్యంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో దుమ్మురేపాడు. ఈ క్రమంలో సూర్య బ్యాటింగ్‌ను కెప్టెన్ హార్దిక్ పాండ్య ప్రశంసలతో ముంచెత్తాడు. ఏమన్నాడంటే?
"ప్రతి ఇన్నింగ్స్‌లో సూర్యకుమార్ ఆటతీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రతిసారి అతడు చెప్పే మాట ఒక్కటే.. బ్యాటింగ్ చేయడం చాలా సులువుగా ఉంది. ఒక వేళ నేనే అతడికి బౌలింగ్ వేస్తే మాత్రం.. సూర్య బ్యాటింగ్‌కు చాలా బాధపడతా. అలాంటి షాట్లు ఆడాడు. ఒకదాని తర్వాత మరొకటి ఇలా వినూత్నంగా షాట్లు కొట్టడం అతడికే సాధ్యం. సూర్యకుమార్‌కు ఎవరి సలహాలు అవసరం లేదు. ఏం చేయాలనేదానిపై పూర్తి స్పష్టతతో ఉంటాడు. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మాత్రం మాట్లాడుకుంటూనే ఉంటాం. అయితే ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు"
"అక్షర్ పటేల్ తన బౌలింగ్‌తోనే కాకుండా అతడి బ్యాటింగ్ నన్ను గర్వపడేలా చేసింది. ఇలా ఆడటం అక్షర్‌కు మరింత ఆత్మవిశ్వాసం ఇవ్వడంతోపాటు జట్టుకు ఎంతో ప్రయోజనకరం. కెప్టెన్‌గా ఆటగాళ్లకు ఎప్పుడూ మద్దతుగా నిలవడమే నా లక్ష్యం. వీరంతా అత్యుత్తమ టీ20 క్రికెటర్లు కాబట్టే ఇక్కడ ఉన్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు.. ఆటగాళ్లకు మద్దతుగా నిలిస్తే అద్భుతాలు చేస్తారు. రెండో టీ20 మ్యాచ్‌లో మాలోని 50 శాతం గేమ్ కూడా ఆడలేదు. అయినా చివరి వరకు పోరాడాం. శ్రీలంకతో సిరీస్‌లో జట్టు ఆడిన తీరుపట్ల ఆనందంగా ఉంది" అని హార్దిక్ వెల్లడించాడు.