Hardik Pandya: 2017ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ గుర్తుందా? భారత అభిమానులకు తీవ్ర మనోవేదన కలిగించిన ఆ మ్యాచ్‌లో.. ఊరట హార్దిక్ పాండ్య మెరుపులే. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్ ముందు 338 పరుగుల భారీ లక్ష్యం నిలిస్తే.. 72 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి మన జట్టు ఘోర పరాభవం దిశగా సాగుతున్న దశలో మేటి పాక్ బౌలింగ్‌ను ఉతికారేస్తూ హార్దిక్ ఆడిన 76 పరుగుల ఇన్నింగ్స్ (43 బంతుల్లో 4×4, 6×6)ను అంత సులువుగా మరిచిపోలేం.
ఇక తర్వాత ఏడాది దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా టెస్టు మ్యాచ్‌లో కఠినమైన కేప్‌టౌన్ పిచ్‌పై భారత్ 92/7తో నిలిచిన దశలో హార్దిక్ వీరోచిత ఇన్నింగ్స్ (95 బంతుల్లో 93; 14×4, 1×6)ను కూడా అభిమానులకు ఇంకా గుర్తే. ఇది హార్దిక్‌కు తొలి విదేశ పర్యటన, తనకది నాలుగో టెస్టు మాత్రమే. ఈ రెండు మ్యాచ్‌ల్లో హార్దిక్ బంతితోనూ సత్తా చాటడం విశేషం. అందుకే అతణ్ని మరో కపిల్ అంటూ అప్పుడందరూ కీర్తించారు. ఆ తర్వాత కొంత కాలం హార్దిక్ ఆట బాగానే సాగింది. మూడు ఫార్మాట్లలో ఆల్‌రౌండర్‌గా సేవలందిస్తూ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు.
2019.. అంతా తలకిందులు..టీ20 లీగ్‌లో ముంబయి తరఫున అదరగొట్టడం ద్వారా వెలుగులోకి వచ్చాడు హార్దిక్. బ్యాటుతో, బంతితో సత్తా చాటడంతో అతను టీమ్‌ఇండియాలోకి రావడానికి ఎంతో సమయం పట్టలేదు. 2016లో టీ20 జట్టులోకి వచ్చిన అతను.. ఏడాదిన్నరకే టెస్టు జట్టులో అడుగు పెట్టాడు. రెండేళ్లలో టీమ్‌ఇండియా ప్రధాన ఆటగాళ్లలో ఒకడయ్యాడు. కానీ 2019లో అతడి కెరీర్ అనూహ్యంగా పక్కదారి పట్టింది. ఆ ఏడాది ఆరంభంలో ఒక టీవీ షోలో మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా తీవ్ర విమర్శలు ఎదుర్కొని కొన్ని మ్యాచ్‌ల పాటు బీసీసీఐ నిషేధానికి గురయ్యాడు హార్దిక్. ఆ ప్రభావం అతడి ఆటపై పడింది. దీనికి తోడు వెన్ను గాయం అతడి కెరీర్‌కు బ్రేకులేసింది.
2019లో వెన్నుకు శస్త్రచికిత్స చేయించుకున్నాక కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. పైగా అప్పట్నుంచి అతడి శరీరం సున్నితంగా మారి, బౌలింగ్‌కు దూరం కావాల్సి వచ్చింది. 2020 టీ20 లీగ్ ద్వారా ఆటలోకి పునరాగమనం చేసినప్పటికీ సీజన్ మొత్తం బౌలింగే చేయలేదు. ఆపై టీమ్‌ఇండియాలోకి తిరిగి వచ్చినా పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయలేకపోయాడు. ఫిట్‌నెస్ సమస్యలు కొనసాగడం, బౌలింగ్ చేయలేని పరిస్థితికి రావడం, బ్యాటింగ్ అంతంతమాత్రంగా ఉండడంతో టీమ్‌ఇండియాలో హార్దిక్‌కు చోటు గల్లంతైంది. టీ20 లీగ్‌లో మొదట్నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముంబయి సైతం అతణ్ని వదిలి పెట్టింది. దీంతో హార్దిక్ పనైపోయిందని అంతా ఓ నిర్ణయానికి వచ్చేశారు.