ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య సారథ్యంలో శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు టీమ్‌ఇండియా సిద్ధమైంది. ఆసియా కప్ సమయంలో లంకేయుల చేతిలో భారత జట్టు ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో తీవ్ర నిరాశలో ఉన్న అభిమానులను ఈ సిరీస్‌తోనైనా అలరిస్తారా? అనే ప్రశ్నకు కెప్టెన్ పాండ్య తాజాగా స్పందించాడు. "బదులు తీర్చుకునేందుకు ఈ సిరీస్‌ను ఉపయోగించుకోవాలని మేం అనుకోవడం లేదు. కానీ, గొప్ప ప్రదర్శన చేయడానికే ప్రయత్నిస్తాం. ప్రత్యర్థి జట్టును జడిపించడానికి కొత్తగా చేయాల్సిందేమీ లేదు. వారికి మా బాడీ లాంగ్వేజ్ చాలు. భారత్‌లో టీమ్‌ఇండియాను ఢీకొడుతున్నారన్న విషయాన్ని గుర్తుచేసేలా ఆడతాం. గత వైఫల్యాలను నా కెప్టెన్సీలో పునరావృతం కాకుండా చూసుకుంటాను" అని పాండ్య పేర్కొన్నాడు.
తన సారథ్యంలో జట్టు ఏ విధంగా ముందుకు వెళ్లనుందనే ప్రశ్నకు స్పందిస్తూ.. "భారత టీ20 లీగ్ ముంగిట కేవలం ఆరు గేమ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రయోగాలు చేసేందుకు ఇది సరైన సమయం కాదు. అయినప్పటికీ కొత్త ప్రణాళికలు రూపొందించుకుంటూ ముందుకువెళ్తాం. అందులో ఏది మంచి ఫలితాలను ఇస్తుందో చూస్తాం. జట్టులో అందరికీ వీలైనన్ని ఎక్కువ అవకాశాలు అందేలా చూస్తాం" అంటూ పాండ్య వివరించాడు.