న్యూజిలాండ్‌ను ఊపిరాడకుండా చేసి వన్డే సిరీస్‌లో విజయం తమ సొంతం చేసుకుంది టీమిండియా. ప్రత్యర్థి జట్టును క్లీన్‌స్వీప్ చేసింది. అయితే అదే ఉత్సాహంతో హార్దిక్ పాండ్య నాయకత్వంలో టీ20లోకి అడుగుపెట్టిన భారత్.. ఓటమిని చవిచూడక తప్పలేదు. రాంచీ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌పై న్యూజిలాండ్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో కివీస్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
"రాంచీ పిచ్ ఇలా స్పందిస్తుందని అనుకోలేదు. ఇరు జట్ల ఆటగాళ్లం ఆశ్చర్యానికి గురయ్యాం. అయితే ఇవాళ కివీస్ క్రికెటర్లు మా కంటే ఉత్తమ క్రికెట్ ఆడారు. అందుకే ఫలితం వారికి అనుకూలంగా వచ్చింది. పాత బంతి కంటే కొత్త బంతి కాస్త ఎక్కువగా తిరుగుతుంది. అలాగే బౌన్స్ అవుతుంది. కానీ, రాంచీలో మాత్రం విభిన్నంగా మారిన పరిస్థితి మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఛేదనలో త్వరగా వికెట్లను కోల్పోయినప్పటికీ.. నేను, సూర్య కుమార్ క్రీజ్‌లో ఉన్నప్పుడు రేసులోనే ఉన్నామనిపించింది. చివరికి కివీస్ విజయం సాధించింది. ఈ వికెట్ మీద 177 పరుగులు ఇవ్వడం సరైంది కాదు. మేం బౌలింగ్‌లో కాస్త వెనుకబడ్డామనిపించింది. అదనంగా 25 పరుగులు సమర్పించాం. దాంతోనే ఓటమిపాలు కావాల్సి వచ్చింది"