గతరాత్రి ఐర్లాండ్‌తో జరిగిన పోరులో టీమ్‌ఇండియా సునాయాస విజయం సాధించింది. ఆతిథ్య జట్టు నిర్దేశించిన 109 పరుగుల లక్ష్యాన్ని 9.2 ఓవర్లలో ఛేదించి సిరీస్‌లో 1-0తో శుభారంభం చేసింది. అయితే, ఇదే మ్యాచ్‌లో తొలిసారి అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్సీ చేపట్టిన హార్దిక్.. మరోకొత్త రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. పొట్టి ఫార్మాట్‌లో టీమ్‌ఇండియా ఎనిమిదో సారథిగా బాధ్యతలు చేపట్టిన అతడు.. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ ఓపెనర్ స్టిర్లింగ్ (4)ను ఔట్ చేయడం ద్వారా వికెట్ తీసిన తొలి సారథిగా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే ఈ ఘనత సాధించాడు.
ఇక వర్షం అంతరాయం కారణంగా 12 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నాలుగు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ విఫలమైనా హ్యారీ టెక్టర్ (64 నాటౌట్; 33 బంతుల్లో 6x4, 3x6) రాణించాడు. ఛేదనలో దీపక్ హుడా(47 నాటౌట్; 29 బంతుల్లో 6x4, 2x6), ఇషాన్ కిషన్ (26; 11 బంతుల్లో 3x4, 2x6) ఓపెనర్లుగా మెరవగా తర్వాత హార్దిక్ పాండ్య (24; 12 బంతుల్లో 1x4, 3x6) దంచికొట్టాడు. దీంతో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌లో బోణీ కొట్టింది. మరోవైపు హార్దిక్ తొలి మ్యాచ్‌లోనే కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. బంతితో ఆదిలోనే వికెట్ తీసి శుభారంభం చేయగా తర్వాత బ్యాట్‌తోనూ మెరుపులు మెరిపించి టీమ్‌ఇండియాను ముందుండి నడిపించాడు.