IPL 2022: క్రికెట్‌లో ఎంత మంది ఎన్ని రికార్డులు నెలకొల్పినా.. కొన్నింటిని ఎవరూ బ్రేక్ చేయలేరు. అవి సాధించడానికి అంత తేలికేమీ కాకపోవడమే అందుకు కారణం. మెగా టీ20 టోర్నీలోనూ పలు గొప్ప రికార్డులున్నాయి. వాటిని చేరుకోవడం కష్టమే. మరి ఆ ప్రత్యేకమైన రికార్డులేంటో.. ఎవరెవరు వాటిని సాధించారో ఓ లుక్కేద్దాం..
బౌలర్లను దంచికొట్టాల్సిందే:బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీ ఒక సీజన్‌లో చేసిన అత్యధిక పరుగుల రికార్డును ఎవరూ అంత తేలిగ్గా సాధించలేరు. 2016లో అతడు 4 సెంచరీలు, 7 అర్ధ శతకాల సాయంతో మొత్తం 973 పరుగులు చేశాడు. మొత్తం 16 మ్యాచ్‌లు ఆడి 152.03 స్ట్రైక్‌రేట్‌తో 81.08 సగటు నమోదు చేశాడు. ఇతర బ్యాట్స్‌మెన్ ఎవరైనా ఈ రికార్డును బద్దలుకొట్టాలంటే బౌలర్లను దంచికొట్టాల్సిందే.
సిక్సర్ల వాన కురవాల్సిందే: సహజంగా టీ20ల్లో శతకం సాధించడమే గొప్ప విశేషం. అలాంటిది ఒకే ఇన్నింగ్స్‌లో ఏకంగా 175 పరుగులు చేశాడంటే మాటలా! ఆ ఘనత సాధించింది క్రిస్‌గేల్. 2013లో అతడు బెంగళూరు తరఫున ఆడుతూ పుణె వారియర్స్‌పై 66 బంతుల్లో 175 పరుగులు సాధించాడు. అందులో మొత్తం 13 బౌండరీలు, 17 సిక్సర్లు దంచికొట్టడం విశేషం. దీంతో ఆ మ్యాచ్‌లో గేల్ స్ట్రైక్‌రేట్ 265.15గా నమోదైంది. ఒకవేళ ఎవరైనా ఈ రికార్డును బద్దలుకొట్టాలంటే స్టేడియంలో సిక్సర్ల జడివాన కురవాల్సిందే.
మరో కెప్టెన్ విశేషంగా రాణించాలి:ఇక మెగా టోర్నీల్లో అత్యంత విజయవంతమైన సారథిగా చెన్నై మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి గొప్ప పేరుంది. నాలుగు సార్లు ట్రోఫీ గెలవడమే కాకుండా అత్యధికంగా చెన్నైని ఫైనల్ చేర్చిన ఘనత అతడి సొంతం. 2008 నుంచీ గతేడాది వరకు మొత్తం 14 సీజన్లు జరిగిన టోర్నీలో 9 సార్లు ఫైనల్ ఆడిన కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. మరోవైపు ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ అత్యధికంగా 5 సార్లు ట్రోఫీ అందుకున్నా ఇలా ఎక్కువసార్లు ఫైనల్ చేరింది లేదు. దీంతో ఈ రికార్డును బద్దలుకొట్టాలంటే.. ఆ భవిష్యత్ కెప్టెన్ ఎవరో విశేషంగా రాణించాలి.
ఈ రికార్డు ఊహించలేం: ఐపీఎల్ 2019 సీజన్‌లో ముంబయి పేసర్ ఆల్‌జారీ జోసెఫ్ బౌలింగ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అప్పుడు హైదరాబాద్ జరిగిన ఓ మ్యాచ్‌లో అతడు 3.4 ఓవర్లు బౌలింగ్ చేసి 6 వికెట్లు పడగొట్టాడు. అప్పుడు 16 డాట్‌బాల్స్ సంధించి 12 పరుగులే ఇచ్చాడు. దీంతో 3.27 అత్యుత్తమ ఎకానమీ నమోదు చేశాడు. ఇది మెగా టోర్నీలోనే మేటి బౌలింగ్ ప్రదర్శనగా నిలిచిపోయింది. ఇక ఈ మ్యాచ్‌లో ముంబయి తొలుత బ్యాటింగ్ చేసి 136/7 స్కోర్ సాధించగా.. ఆపై ఆల్‌జారీ ధాటికి సన్‌రైజర్స్ 96 పరుగులకే ఆలౌటైంది.
ఇది ఎవరూ కోరుకోరు కూడా: ఒక మ్యాచ్‌లో అత్యంత ఘోరంగా బ్యాటింగ్ చేసిన జట్టు ఏదైనా ఉందా అంటే అది బెంగళూరు మాత్రమే. 2017లో కోల్‌కతాతో జరిగిన ఆ మ్యాచ్‌లో కోహ్లీసేన కేవలం 49 పరుగులకే ఆలౌటైంది. అప్పుడు కోల్‌కతా తొలుత బ్యాటింగ్ చేసి 19.3 ఓవర్లలో 131 పరుగులకే పది వికెట్లు కోల్పోగా.. తర్వాత బెంగళూరు 49 పరుగులకే చాపచుట్టేసింది. ఆ ఇన్నింగ్స్‌లో కేదార్ జాదవ్ (9) టాప్‌స్కోరర్. గేల్ (7), డివిలియర్స్ (8), కోహ్లీ (0) పూర్తిగా విఫలమయ్యారు. దీంతో బెంగళూరు అత్యంత తక్కువ స్కోర్ నమోదు చేసిన జట్టుగా నిలిచింది. ఈ రికార్డును ఎవరూ కోరుకోరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈసారి ఎవరైనా రికార్డులను ఎవరు బద్దలు కొడతారేమో చూడాలి.