టీ20 ప్రపంచకప్లో(T20 World Cup 2021) అఫ్గానిస్థాన్ జట్టుతో క్రికెట్ ఆడేందుకు ఇతర జట్లు కూడా విముఖత చూపుతాయని ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ టిమ్ పైన్ అన్నాడు. తాలిబన్ల పాలన నేపథ్యంలో మహిళా క్రికెటర్లను ప్రోత్సహించకపోతే.. నవంబర్లో అఫ్గాన్, ఆస్ట్రేలియా(Afghanistan vs Australia) జట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరగదని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు పైన్(Tim Paine news).
క్రికెట్ విషయంలోనూ మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడితే.. ఆస్ట్రేలియా జట్టు టెస్టు మ్యాచ్ ఆడబోదని ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్(Australia Cricketers Association) తేల్చి చెప్పింది. ఈ నిర్ణయాన్ని సమర్థించిన పైన్.. అఫ్గాన్ లాంటి జట్టును మెగాటోర్నీలో ఆడేందుకు ఐసీసీ ఎలా అనుమతిస్తుందో చూడాలని ఉందని అన్నాడు.
"క్రికెట్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా ప్రభుత్వం, ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ అసోసియేషన్ దీనిపై స్పందించారు. కానీ, ఐసీసీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. నెలరోజుల్లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. అందులో అఫ్గాన్ టీమ్ కూడా ఉండటం ఆశ్యర్చకరం. వెంటనే అఫ్గాన్ టీ20 ప్రపంచకప్లో ఆడే విషయమై ఐసీసీ స్పందించాలి."
-టిమ్ పైన్, ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్.