టీమ్‌ఇండియాకు ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కోచ్ ఉంటే బాగుంటుంది అనే చర్చ గత కొద్ది రోజుల నుంచి నడుస్తోంది. తాజాగా ఈ విషయమై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. ఆ చర్చను సమర్థించేలా మాట్లాడాడు. టీమ్‌ఇండియా టీ20 కోచ్‌గా పేస్ దిగ్గజం ఆశిశ్ నెహ్రా అయితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను తక్కువగా అంచనా వేయలేమని అన్నాడు. ఎంతోకాలం ద్రవిడ్‌తో పని చేసిన తనకు... ద్రవిడ్ గురించి తెలుసని, ఆటపై అతనికున్న అవగాహన గురించి తెలుసని భజ్జీ చెప్పాడు. అయితే ఇంగ్లాండ్ జట్టు కూడా ఇదే తరహాలో ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కోచ్‌ను నియమించుకున్న విషయం తెలిసిందే.
వారిద్దరు కలిస్తే.. "టీ20లు కాస్త భిన్నమైనవని.. ఈ ఫార్మాట్‌లో అద్భుతంగా రాణించిన ఆశిశ్ లాంటి వారైతే 2024 ప్రపంచకప్‌నకు మన జట్టును మరింత మెరుగ్గా సన్నద్ధం కావచ్చు. అలాగని ద్రవిడ్‌ను పక్కన పెట్టాలని నేను చెప్పను. ఆశిశ్, రాహుల్ కలసి పనిచేస్తే 2024 ప్రపంచకప్ సమయానికి జట్టును మరింత మెరుగ్గా నిర్మించవచ్చు. న్యూజిలాండ్‌తో సిరీస్ సమయంలో ద్రవిడ్‌కు విశ్రాంతినిచ్చారు. అలాంటప్పుడు మరో కోచ్ ఉంటే ఆ బాధ్యతలను చూసుకొంటాడుఫార్మాట్‌ను బట్టి ఆటగాళ్లను మార్చాలి" అని హర్భజన్ అన్నాడు.