Harbhajan Singh News: భారత జట్టు ఆటగాళ్లకు రక్షణ కల్పించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలిని(బీసీసీఐ) కోరాడు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్. తనను ఓ జర్నలిస్ట్ బెదిరించాడని చెప్పిన వృద్ధిమాన్ సాహా.. అందుకు సంబంధించిన వాట్సాప్ మెసేజీల స్క్రీన్‌షాట్ బహిర్గతం చేశాడు. దీనిపై స్పందించిన హర్భజన్.. సాహాలా ఎవరికీ జరగకుండా చూడాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ సహా ఉన్నతాధికారులకు ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశాడు.
"సాహా.. ఆ వ్యక్తి పేరు వెల్లడించు. తద్వారా ఈ విధంగా ఎవరు చేస్తున్నారో క్రికెట్ సమాజానికి తెలుస్తుంది. లేకుంటే మంచి వాళ్లను కూడా అనుమానించాల్సి వస్తుంది. ఇదేం జర్నలిజం?" అంటూ గంగూలీ, జైషా, ఠాకూర్ అరుణ్‌లను భజ్జీ ట్యాగ్ చేశాడు.
అండగా ఉంటా..
అంతకుముందు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా సాహాకు మద్దతుగా నిలిచాడు. ఆ జర్నలిస్టు వ్యాఖ్యాల్ని తీవ్రంగా ఖండించాడు.
"ఇలా చేయడం చాలా విచారకరం. అతను గౌరవించ తగ్గ వ్యక్తి కాదు లేదా పాత్రికేయుడు కాదు. ఇది కేవలం చెంచాగిరి. నీకు అండగా ఉంటా వృద్ధి" అని సెహ్వాగ్ ఘాటుగా ట్వీట్ చేశాడు.
అసలేమైందంటే..?
సాహా.. ఓ జర్నలిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ జర్నలిస్టు ఇంటర్వ్యూ కోసం తనను బలవంతం చేసినట్లు పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వాట్సాప్ మెసేజీల స్క్రీన్‌షాట్ బహిర్గతం చేశాడు. అయితే, తాను స్పందించకపోయేసరికి తీవ్ర వ్యాఖ్యలు చేశాడని సాహా పేర్కొన్నాడు. 'భారత క్రికెట్ జట్టుకు నేను చేసిన సేవలకు గాను ఒక జర్నలిస్టు నుంచి ఎదురైన అనుభవం ఇది. జర్నలిజం ఇంత దిగజారిపోయింది' అని సాహా విచారం వ్యక్తం చేశాడు. వచ్చేనెలలో శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సాహాకు చోటు దక్కని నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
రాహుల్ ద్రవిడ్ నన్ను రిటైరవమన్నాడు: సాహా
అంతకముందు.. సాహా ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. అతడిని జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ రిటైర్మెంట్ గురించి ఆలోచించమని సూచించినట్లు తెలిపాడు. జట్టు యాజమాన్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన బెంగాల్ క్రికెటర్ తనతో ద్రవిడ్, గంగూలీ ఏం చెప్పారో వెల్లడించాడు.
"నన్ను ఇకపై జట్టు ఎంపికలో పరిగణనలోకి తీసుకోబోమని జట్టు యాజమాన్యం ముందే చెప్పేసింది. అలాగే రిటైర్మెంట్ గురించి ఆలోచించాలని కూడా కోచ్ ద్రవిడ్ నాకు సూచించాడు. గతేడాది నవంబర్‌లో న్యూజిలాండ్‌తో కాన్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టు సందర్భంగా గాయంతో ఇబ్బంది పడుతూనే 61 పరుగులతో అజేయంగా నిలిచాను. అప్పుడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ నాకు వాట్సాప్ ద్వారా శుభాకాంక్షలు చెప్పాడు. తాను బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం దేని గురించీ ఆలోచించాల్సిన పని లేదన్నాడు. దీంతో నా ఆత్మవిశ్వాసం పెరిగింది. కానీ, ఇంత వేగంగా పరిస్థితులు ఎలా మారిపోయాయో నాకర్థం కావడం లేదు'' అని సాహా వాపోయాడు.
ఈ నలుగురు మళ్లీ వస్తారా?
సీనియర్ క్రికెటర్లు అజింక్య రహానె, పుజారా, ఇషాంత్ శర్మతో పాటు సాహా కొద్ది కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. ఈ నలుగురు జాతీయ జట్టులో వీరికి అవకాశం దక్కడం.. ఇప్పుడు కష్టంగా మారింది. త్వరలోనే శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్‌కు వీరు ఎంపిక అవ్వలేదు. దీంతో ఈ సీనియర్ ఆటగాళ్లు తిరిగి జట్టులోకి వస్తారా? అనేది అనుమానంగా మారింది.
ఇదీ చూడండి:IPL 2022: డిఫరెంట్‌గా గుజరాత్ జట్టు లోగో ఆవిష్కరణ