Harbhajan Singh BCCI: టీమ్ఇండియా మాజీ ఆటగాడు, దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బీసీసీఐపై మండిపడ్డాడు. బోర్డు పక్షపాత వైఖరి కారణంగా 2011 ప్రపంచకప్ టీమ్ఇండియా జట్టు ఆటగాళ్ల కెరీర్ నాశనమైందని అన్నాడు. ఆ జట్టుకు ఆడిన ఎందరో ఆటగాళ్లకు అదే చివరి వరల్డ్‌కప్ అయిందని చెప్పుకొచ్చాడు. తమను బోర్డు వాడుకుని వదిలేసిందని వాపోయిన భజ్జీ.. 2011 జట్టు అంటే అంత అలుసా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
"ఆ సమయంలో బీసీసీఐ అధికారులు ఏం చేసేవారో మీకు తెలుసు. అప్పుడు టీమ్ఇండియాలో ఆడేందుకు కేవలం కొందరికే అవకాశం వచ్చేది. మిగతా వారిని అసలు పట్టించుకోలేదు. 2011లో ప్రపంచకప్‌ను సాధించిన సత్తా ఉన్న మా జట్టుకు ఆ తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం ఇవ్వలేదు. ప్రపంచకప్ సాధించేందుకు సరైనది అని మీరు భావించిన జట్టే టోర్నీ తర్వాత పనికి రాకుండా పోయిందా?"
-హర్భజన్ సింగ్, టీమ్ఇండియా మాజీ స్పిన్నర్