Harbhajan on Dhoni: అనామకుడిగా ఉన్న స్థాయి నుంచి తనను చేయి పట్టుకుని నడిపించిన ఘనత బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీదేనని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు హర్భజన్‌సింగ్ అన్నాడు. మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్ అయ్యాక 'ఎవరో' అన్నట్లు తన పరిస్థితి మారిపోయిందని భజ్జీ తెలిపాడు.
"కెరీర్‌లో అనామకుడిగా ఉన్న సమయంలో గంగూలీ నాకు చేయి అందించాడు. ధోనీ సారథి అయ్యే సమయానికి నాకొక గుర్తింపు ఉంది. ఈ తేడాను మీరు అర్థం చేసుకోవాలి. నాలో నైపుణ్యాలు ఉన్నాయని దాదాకు తెలుసు. కానీ సత్తాచాటగలనో లేదో అతనికి తెలియదు. ధోనీ విషయానికొస్తే నేను ఎప్పట్నుంచో జట్టులో ఉన్నానని.. సత్తా చాటానని అతనికి తెలుసు. ధోనీ కంటే ముందు మ్యాచ్‌లు గెలిపించానని అతనికి అవగాహన ఉంది. అతని కోసం కూడా కొన్ని మ్యాచ్‌లు గెలుస్తాననీ తెలుసు. జీవితంలో, వృత్తిలో సరైన సమయంలో మార్గనిర్దేశనం చేసే వ్యక్తి కావాలి. నా విషయంలో గంగూలీ అలాంటి వ్యక్తే. గంగూలీ నా కోసం పోరాడకుండా.. జట్టులోకి ఎంపిక చేయకుండా ఉండుంటే ఈరోజు నా ఇంటర్వ్యూ తీసుకునేవారు కాదేమో. నన్ను తీర్చిదిద్దిన నాయకుడు గంగూలీ. నేను ఈస్థాయిలో ఉండటానికి దాదానే కారణం" అని తెలిపాడు భజ్జీ.