ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు(T20 World Cup India Squad) ఎంపికైన నేపథ్యంలో టీమ్‌ఇండియా సీనియర్ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(R Ashwin News) భావోద్వేగ ట్వీట్ చేశాడు. నాలుగేళ్ల తర్వాత అశ్విన్‌కు భారత టీ20 జట్టులో చోటు లభించింది.
"ప్రతి సొరంగం చివరన వెలుతురు ఉంటుంది. వెలుతురు చూడగలమని నమ్మిన వాళ్లే దాన్ని చూసేందుకు బతికుంటారు" అని రాసిన చిత్రాన్ని అశ్విన్ ట్వీట్ చేశాడు. "ఈ మాటలను గోడపై అంటించడానికి ముందే కొన్ని లక్షల సార్లు నా డైరీలో రాశాను! మనం చదివే మంచి మాటలను అన్వయించుకొని, జీవితంలో ఆచరిస్తే అవి మనకు మరింత ప్రేరణ, బలాన్ని ఇస్తాయి" అని రాసుకొచ్చాడు.
అశ్విన్ వయసు 34 ఏళ్లు. ఒకప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ అతడు కీలక సభ్యుడే. యువ క్రికెటర్లు రావడం వల్ల తెలుపు బంతి క్రికెట్‌కు అతడిని ఎంపిక చేయడం లేదు. నాలుగేళ్లుగా అతడికి జట్టులో చోటు దక్కడం లేదు. ఇప్పుడు జరుగుతున్న ఇంగ్లాండ్ టెస్టు సిరీసులోనూ(Ashwin in England) అతడిని తుది జట్టులోకి ఎంపిక చేయలేదు. వరుసగా నాలుగు మ్యాచుల్లో రిజర్వు బెంచికే పరిమితం చేశారు. ఐదో టెస్టులోనైనా చోటు లభిస్తుందో లేదో తెలియదు.
2017, జులై 9న యాష్ చివరిగా వెస్టిండీస్‌పై టీ20 ఆడాడు. అదే జట్టుపై జూన్ 30న చివరి వన్డే ఆడాడు. 111 వన్డేలాడిన అతడు 32.91 సగటుతో 150 వికెట్లు తీశాడు. 46 టీ20ల్లో 22.94 సగటు, 6.97 ఎకానమీతో 52 వికెట్లు పడగొట్టాడు. ఇక 79 టెస్టులాడి 24.56 సగటు, 2.80 ఎకానమీతో 413 వికెట్లు తీశాడు. యువ ఆటగాడు వాషింగ్టన్ సుందర్ గాయపడటం, దుబాయ్ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలించనున్న నేపథ్యంలో యాష్ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ పేర్కొన్నారు.
ఇదీ చదవండి:T20 World Cup: భారత టీ20 ప్రపంచకప్ జట్టు.. మెంటార్‌గా ధోనీ