వన్డే క్రికెట్లో లక్ష్యాలను ఎలా ఛేదించాలో మాజీ కోచ్ గ్రెగ్ ఛాపెల్(Greg Chappell) నేర్పించారని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా(Suresh Raina) అన్నాడు. ఆటగాళ్లతో బృందచర్చల్లో నిరంతరం బ్యాటింగ్, భాగస్వామ్యాల ప్రాముఖ్యం వివరించేవారని పేర్కొన్నాడు. విజయాలు సాధించడంపై దృష్టి పెట్టాలని సూచించారన్నాడు. తన ఆత్మకథ 'బిలీవ్'(Raina Believe)లో ఈ వివరాలను రైనా పొందుపరిచాడు.
"గ్రెగ్ ఛాపెల్ కోచింగ్ కెరీర్ వివాదాల మయం కావొచ్చు. కానీ విజయాలు ఎలా సాధించాలో టీమ్‌ఇండియాకు అతడు నేర్పించాడు. విజయం ప్రాముఖ్యాన్ని బోధించాడు. నిజానికి మేమంతా అప్పుడు బాగా ఆడుతున్నాం. లక్ష్య ఛేదనల్లో బ్యాటింగ్, భాగస్వామ్యాల గురించి అతడు నొక్కి చెప్పడం నాకు గుర్తుంది."
- సురేశ్ రైనా, టీమ్ఇండియా మాజీ క్రికెటర్