క్రికెట్లో మరో కొత్త ఫార్మాట్‌కు ప్రాణం పోయడానికి ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) సిద్ధంగా ఉంది. ప్రారంభ ఎడిషన్ 'ది హండ్రెడ్' లీగ్ ప్రారంభానికి సంబంధించి ప్లేయింగ్ కండిషన్స్‌ను ఈసీబీ విడుదల చేసింది. కొవిడ్ నేపథ్యంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్న ఈ లీగ్.. జులై 21న ప్రారంభం కానుంది.
ఇకపై ఓవర్ల ఫార్మాట్‌కు స్వస్తి చెప్పి బంతులను లెక్కించే పద్ధతి రానుందని ఇంగ్లాండ్ బోర్డు వెల్లడించింది. ఈ 100 బంతుల లీగ్‌లో 5 బంతులను ఒక సెట్‌గా పరిగణిస్తారు. టీవీ వ్యాఖ్యాతలు మాత్రం ఓవర్లు అనే పదాన్ని వాడనున్నారని స్పష్టం చేసింది.
ఆట నిబంధనలు..
- ఈ లీగ్ ప్రకారం ఇకపై ఓవర్ల స్థానంలో బంతులను లెక్కిస్తారు.
- ఐదు బంతులను ఒక 'సెట్'గా పరిగణిస్తారు. ఒక సెట్ అయిపోయాక అంపైర్.. బ్రాడ్కాస్టర్లు, స్కోర్ బోర్డు, ఆటగాళ్లు, ప్రేక్షకులకు వైట్‌కార్డ్‌ను చూపిస్తారు.
- ఒకే ఎండ్ నుంచి వరుసగా రెండు సెట్లను వేయవచ్చు. అవసరమైతే ఒకే బౌలర్ రెండు సెట్లను వరుసగా బౌల్ చేయవచ్చు. అంటే ఒక బౌలర్ పది బంతులను వేయవచ్చు.
- మొదటి 25 బంతులను మొదటి పవర్ ప్లేగా పరిగణిస్తారు.
- తొలి పవర్ ప్లే తర్వాత ఫీల్డింగ్ జట్టు రెండు నిమిషాల వ్యూహాత్మక విరామాన్ని తీసుకోవచ్చు.
- గ్రూప్ దశలో మ్యాచ్ కనుక టై అయితే ఇరు జట్లకు చెరో పాయింటు కేటాయిస్తారు. నాకౌట్ మ్యాచ్‌ల్లో ఈ నిబంధన వర్తించదు. 'సూపర్ ఫైవ్' నిర్వహిస్తారు. అనగా ఇప్పుడున్న 'సూపర్ ఓవర్' లాంటిదేనన్న మాట.
- ఈ 'సూపర్ ఫైవ్' కూడా 'టై' అయితే రెండో సూపర్ ఫైవ్ నిర్వహిస్తారు. అది కూడా టై అయితే అప్పటివరకు మెరుగైన ప్రదర్శన చేసిన జట్టును విజేతగా ప్రకటిస్తారు.
ఇదీ చదవండి:క్రికెట్ 'మక్కా'లో టీమ్ఇండియా 'దాదా'గిరి!