Golden Ticket World Cup 2023 :టీమ్ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar)కు 2023 ప్రపంచకప్ గోల్డెన్ టికెట్ అందింది. ఈ టికెట్‌ను బీసీసీఐసెక్రటరీ జై షా.. శుక్రవారం స్వయంగా సచిన్‌కు అందజేశారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. "ఇండియన్ ఐకాన్స్‌కు గోల్డెన్ టికెట్స్ కార్యక్రమంలో భాగంగా, బీసీసీఐ సెక్రటరీ జై షా.. భారతరత్న శ్రీ సచిన్ తెందూల్కర్‌కు టికెట్ అందజేశారు. సచిన్ క్రికెట్ ప్రయాణం ఎన్నో తరాలలో స్పూర్తిని నింపింది. ఇప్పుడు ఆయన ఐసీసీ 2023 వరల్డ్‌కప్ లైవ్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు" అని ట్విట్టర్లో రాసుకొచ్చింది. అయితే ఇదివరకే ఈ గోల్డెన్ టికెట్‌ను బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కు కూడా అందజేసింది బీసీసీఐ.
గోల్డెన్ టికెట్ అంటే ఏంటీ?
What Is Golden Ticket :భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీని విజయవంతంగా నిర్వహించడం కోసం బీసీసీఐ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ.. గోల్డెన్ టికెట్ కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ఈ గోల్డెన్ టికెట్ అందుకున్న వారు, ప్రపంచకప్‌లోని అన్ని మ్యాచ్‌లను స్టేడియంలో ప్రత్యక్షంగా.. వీఐపీ బాక్స్‌లో కూర్చొని వీక్షించవచ్చు. దీంతోపాటు ఈ టికెట్‌పై వారికి వీఐపీ వసతులన్నింటినీ కల్పిస్తారు. అందులో భాగంగానే బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, సచిన్ తెందూల్కర్ ఇద్దరికి ఈ టికెట్ అందింది. మున్ముందు ఈ గోల్డెన్ టికెట్లను దేశంలోని ఆయా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
మరో 25 రోజుల్లో ప్రారంభమయ్యే ప్రపంచకప్ కోసం.. బీసీసీఐ రీసెంట్గా 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది. గాయం కారణంగా గత ఆరు నెలల నుంచి ఆటకు దూరంగా ఉన్న స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు జట్టులో చోటు దక్కింది.