Glenn Maxwell World Cup 2023 : ప్రపంచ క్రికెట్ చరిత్రలోని ప్రమాదకర బ్యాటర్ల లిస్ట్‌లో అతడు ఉంటాడు. బౌలర్లపై కనికరం లేకుండా.. బంతిని నిర్దాక్షిణ్యంగా బాదే ప్లేయర్లలో అతని పేరు తప్పకుండా ఉంటుంది. మైదానంలోకి అతడు అడుగుపెడితే ఇక పరుగుల వరద పారడం ఖాయం. క్రికెట్లో ఎంతో మంది దిగ్గజాలు, స్టార్ బ్యాటర్లున్నారు. అయితే తనకే సొంతమైన శైలితో.. అతనిలాగా బంతిని ఊచకోత కోస్తూ అభిమానులను అలరించే ఆటగాడు మరొకరు ఉండరంటే అతిశయోక్తి కాదు. అతను మరెవరో కాదు ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్. తాజాగా నెదర్లాండ్స్‌పై జరిగిన మ్యాచ్‌లో అతను విరుచుకుపడిన తీరు.. ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన విధానం ఎవ్వరూ అంతా ఈజీగా మరచిపోలేరు.
తన రికార్డును తానే బద్దలు చేసి..
నెదర్లాండ్స్‌పై 40 బంతుల్లోనే సెంచరీ సాధించిన మ్యాక్స్‌వెల్.. ఇదే మ్యాచ్ వేదికగా మరికొన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు మార్‌క్రమ్ నమోదు చేసిన రికార్డు (49 బంతుల్లో)ను ఇప్పుడు మ్యాక్సీ తిరగరాశాడు. ఆస్ట్రేలియా తరపున అత్యంత వేగంగా వన్డే శతకం చేసిన ఆటగాడిగానూ తన రికార్డు (2015 ప్రపంచకప్‌లో శ్రీలంకపై 51 బంతుల్లో)ను తానే మెరుగు పరుచుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన ఆటగాళ్ల జాబితాలో డివిలియర్స్ (31 బంతుల్లో), కోరె అండర్సన్ (36), షాహిద్ అఫ్రిది (37) టాప్ 3లో ఉండగా.. నాలుగో స్థానాన్ని మ్యాక్సీ కైవసం చేసుకున్నాడు.
గాయాన్ని దాటి మరీ..
అసలు ఈ ప్రపంచకప్‌లో మ్యాక్‌వెల్ ఆడటం పట్ల అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. దీనికి కారణం అతని గాయాలు. ఓ పార్టీ సమయంలో అనుకోకుండా అతని ఎడమ కాలు విరిగింది. అయితే దాని నుంచి కోలుకుని అతను తిరిగి ఆటలో అడుగుపెట్టాడు. కానీ ప్రపంచకప్ నెల రోజులు ఉందన్న సమయంలో మరోసారి చీలమండ గాయం బారిన పడ్డాడు. దీంతో అతను ప్రపంచకప్‌లో ఆడేది అనుమానంగానే మారింది. కానీ ఆ గాయం నుంచి కూడా కోలుకుని టోర్నీలో అడుగుపెట్టిన ఈ ఆల్‌రౌండర్‌గా స్పిన్నర్‌గానూ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
జట్టులో ప్రధాన స్పిన్నర్‌గా జంపా ఒక్కడే ఉండటం వల్ల మరోవైపు నుంచి మ్యాక్సీ ప్రత్యర్థిని కట్టడి చేస్తున్నాడు. ఎంతోమంది బ్యాటర్లు క్రీజులోకి వస్తారు.. పరుగులు సాధిస్తారు.. సెంచరీలు చేస్తారు.. వెళ్లిపోతారు. కానీ మ్యాక్సీలాగా ఆటతీరుతో అలరించే బ్యాటర్లు చాలా అరుదనే చెప్పాలి. అతనికి బౌలర్‌తో పని లేదు. తొలి బంతి నుంచే ఎదురు దాడికి దిగడం మాత్రమే తెలుసు.