Glenn Maxwell Hindu Marriage: కరోనా కారణంగా పలుసార్లు తన వివాహాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్.. ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కాడు. తన ప్రేయసి వినీ రామన్‌ను మార్చి 18న పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకున్న ఈ జంట.. ఇప్పుడు మరోసారి భారతీయ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహం ఆదివారం(మార్చి 27) జరిగినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఆ వీడియోలో.. వినీ రామన్ సంప్రదాయ పద్ధతిలో పట్టుచీర కట్టుకొని కనిపిస్తోంది. అదే సమయంలో మ్యాక్స్‌వెల్ షేర్వాణీలో ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వారి దుస్తులను చూస్తుంటే ఈ వివాహం తమిళ బ్రాహ్మణ పద్ధతిలో జరిగినట్లు తెలుస్తోంది. తమిళనాడుకు చెందిన వినీ రామన్ ఆస్ట్రేలియాలో మెడిసిన్ పూర్తి చేసి అక్కడే ప్రాక్టీస్ చేస్తోంది 2013లో ఓ ఈవెంట్‌లో ఆమెను చూసిన మాక్స్‌వెల్ తొలి చూపులోనే ప్రేమలో పడిపోయాడు. అప్పటి నుంచి వాళ్లిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమైన సమయంలో వినీ రామన్ అండగా నిలిచిందని.. మానసిక ఒత్తిడి నుంచి కోలుకుని.. తిరిగి ఫామ్ అందుకోవడంలో ఆమె పాత్ర కీలకమని మాక్స్‌వెల్ పలు సందర్భాల్లో పేర్కొన్నాడు.