Rohit Sharma Test Captaincy: విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీకి ముగింపు పలికినప్పటి నుంచి తర్వాతి కెప్టెన్ ఎవరు అనే విషయంలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలా ఫిట్‌గా ఉంటూ.. అన్ని మ్యాచులకు అందుబాటులో ఉండే ఆటగాడికే అవకాశమివ్వాలని సూచించారు. టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నట్లు కోహ్లీ గత శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే.
'భారత జట్టును నడిపించాలంటే ఫిట్‌నెస్ చాలా అవసరం. ప్రస్తుతం టెస్టు కెప్టెన్సీ రేసులో సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ ముందంజలో ఉన్నాడు. కానీ, అతడిని ఫిట్‌నెస్ సమస్య వేధిస్తోంది. తొడకండరాల గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు. భవిష్యత్తులో అది పునరావృతమయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అతడికి టెస్టు పగ్గాలు అప్పగిస్తే.. జట్టును నడిపించగలడా అనే అనుమానం ఉంది. టీమ్‌ఇండియా భవిష్యత్తు దృష్ట్యా.. కోహ్లీలా ఫిట్‌గా ఉండి, సుదీర్ఘకాలం కెప్టెన్‌గా కొనసాగే ఆటగాడు కావాలి. కెప్టెన్‌గా ప్రతి మ్యాచ్‌కు అందుబాటులో ఉండే ఆటగాడు అవసరం' అని సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డారు.
పొట్టి ఫార్మాట్‌లో కెప్టెన్‌గా రోహిత్ శర్మకు తిరుగులేని రికార్డుంది. దాన్ని ఎవరూ కాదనలేరు. 34 ఏళ్ల హిట్‌మ్యాన్ ఎంత కాలం టెస్టు క్రికెట్లో కొనసాగుతాడో కచ్చితంగా చెప్పలేం. ఇలాంటి పరిస్థితుల్లో అతడికి టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించి మరింత ఒత్తిడి పెంచొద్దనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అతడి ఫిట్‌నెస్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో తర్వాతి టెస్టు కెప్టెన్ ఎవరు అనే విషయం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో రోహిత్ గాయం నుంచి కోలుకొంటున్నాడు. త్వరలో వెస్టిండీస్‌తో జరుగనున్న సిరీస్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.