Gautam Gambhir Ramiz Raja: పాక్‌లో భారత్ ఆడకపోతే.. తాము కూడా ఆ దేశంలో ఆడేది లేదని పీసీబీ చీఫ్ రమీజ్ రజా చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. రజా హెచ్చరికలపై నిన్న కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కౌంటర్ ఇవ్వగా.. తాజాగా మాజీ ఓపెనర్, భాజపా ఎంపీ గౌతమ్ గంభీర్ స్పందించారు. 'ఇది బీసీసీఐ, పీసీబీ తీసుకోవాల్సిన నిర్ణయం. వారు ఏ నిర్ణయం తీసుకున్నా సమష్టిగా తీసుకోవాలి' అని గంభీర్ ఓ జాతీయ మీడియాతో అన్నారు.
వచ్చే ఏడాది పాక్‌లో ఆసియా కప్ జరగనుంది. ఆ తర్వాత అదే ఏడాది భారత్‌లో వన్డే ప్రపంచకప్ నిర్వహించనున్నారు. గతంలో బీసీసీఐ కార్యదర్శి జైషా మాట్లాడుతూ.. పాక్‌తో తటస్థ వేదికలపైనే ఆడతామని, ఆ దేశంలో పర్యటించే అవకాశం లేదని చెప్పారు. దీనిపై ఇటీవల పీసీబీ ఛైర్మన్ రమీజ్ రజా స్పందిస్తూ.. బీసీసీఐ ఆ నిర్ణయం తీసుకుంటే.. భారత్‌లో వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌లో పాక్ భాగం కాబోదని హెచ్చరిస్తున్నట్లు వ్యాఖ్యానించాడు. అతడి హెచ్చరికలపై కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ప్రపంచ క్రీడల్లో భారత్ అత్యంత శక్తిమంతమైన దేశమని, తమను ఎవరూ శాసించలేరని దీటుగా బదులిచ్చారు. తాజాగా ఇదే అంశంపై గంభీర్ స్పందించాడు.