ఐపీఎల్.. ఈ మెగాలీగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందరో ఆటగాళ్లు ఈ లీగ్‌తోనే ఓవర్‌నైట్ స్టార్స్‌గా ఎదిగారు. తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. జాతీయ జట్టులో స్థానం కూడా దక్కించుకున్నారు. అయితే మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్ తాజా సీజన్ ప్రారంభంకానుంది. దీంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ షోలో పాల్గొన్న టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు గంగూలీ కీలక కామెంట్స్ చేశాడు.
ఐపీఎల్ భవిష్యత్‌లో పెద్ద ఆటగాళ్లుగా మారే ఐదుగురు యువ ఆటగాళ్లను సెలెక్ట్ చేశాడు. వారు తమ ఆటతో ఉన్నత స్థాయికి చేరుకుంటారని కితాబిచ్చాడు. లేటు వయసులో టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చి తన సంచలన ఇన్నింగ్స్ ఆటతీరుతో అభిమానులను ఆకట్టుకుంటున్న సూర్యకుమార్ యాదవ్‌ను... యంగ్ ప్లేయర్స్‌తో కాకుండా స్పెషల్ కేటగిరీలో ఎంచుకున్నాడు.
యంగ్ ప్లేయర్స్‌లో.. మొదట పృథ్వీ షాను సెలెక్ట్ చేసుకోగా.. రెండు, మూడు స్థానాల్లో రిషభ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్‌లను ఎంచుకున్నాడు. నాలుగు, ఐదు స్థానాల్లో ఉమ్రాన్ మాలిక్, శుభ్‌మన్ గిల్‌లను తీసుకున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా ఉన్న శ్రేయస్ అయ్యర్, ముంబయి ఇండియన్స్‌కు ఆడుతున్న ఇషాన్ కిషన్‌లను గంగూలీ పరిగణనలోకి తీసుకోలేదు.