Ganguly BCCI President: మహిళల ఐపీఎల్‌పై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కీలక ప్రకటన చేశారు. పూర్తిస్థాయి మహిళల ఐపీఎల్‌ను నిర్వహించడానికి వచ్చే ఏడాది సరైన సమయమని చెప్పుకొచ్చారు. పురుషుల ఐపీఎల్‌కు దీటుగా ఈ టోర్నీని నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అధ్యక్షుడిగా గంగూలీ బాధ్యతలు చేపట్టి 26 నెలలు పూర్తయిన నేపథ్యంలో పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ఏటా 'ఉమన్స్ టీ20 ఛాలెంజ్' పేరుతో మూడు జట్లతో మినీ టోర్నీను బీసీసీఐ నిర్వహిస్తోంది. అయితే గతేడాది రెండు విడతల్లో పురుషుల ఐపీఎల్ నిర్వహించిన కారణంగా ఈ టోర్నీ జరగలేదు.
నాకు ఆ అవసరం లేదు
ఆటగాళ్ల ఎంపికపై సెలక్షన్ కమిటీని తాను ప్రభావితం చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలను ఖండించారు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ. ఇటువంటి నిరాధార ఆరోపణలపై తాను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. బోర్డు అధ్యక్షుడి కన్నా ముందు తాను కూడా ఓ ఆటగాడిని అనే విషయంపై విమర్శకులు మర్చిపోవద్దని చెప్పారు.
"నేను సెలక్షన్ కమిటీ మీటింగ్‌లో ఉన్నట్లు ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరలైంది. దానిపై నేను స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. అది సెలక్షన్ కమిటీ మీటింగ్‌కు చెందినది కాదు. ఆ చిత్రంలో ఉన్న జాయింట్ సెక్రటరీ జయేష్ జార్జి అసలు కమిటీ మీటింగ్స్‌లో పాల్గొనరు."