Gambhir KL Rahul: టీమ్ఇండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు మాజీ దిగ్గజ ఆటగాడు గౌతమ్ గంభీర్ వార్నింగ్ ఇచ్చాడు. ఐపీఎల్లో జట్టుకు సారథిగా ఉన్నంత మాత్రాన.. భారత క్రికెట్ జట్టు కెప్టెన్సీకి గ్యారంటీ ఉండదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటూ గంభీర్ చురకలంటించాడు. లఖ్‌నవూ టీమ్‌కు కావాల్సింది జట్టును నడిపించే బ్యాటర్ కానీ.. బ్యాటింగ్ చేసే కెప్టెన్ కాదని అన్నాడు. ఈ రెండింటి మధ్య తేడాను రాహుల్ అర్థం చేసుకుంటాడని భావిస్తున్నన్నాడు గంభీర్. కాగా, లఖ్‌నవూ జట్టుకు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. గంభీర్ మెంటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
"సారథి అనేవాడు మైదానంలో కచ్చితంగా రిస్కు తీసుకోవాలి. కొన్ని సార్లు సరైన సమయంలో రిస్కు తీసుకోకపోతే విజయం సాధిస్తామో లేదో చెప్పలేం. ఇప్పుడు లఖ్‌నవూ జట్టుకు కీపింగ్ కోసం క్వింటన్ డికాక్ ఉన్నాడు కాబట్టి.. ఇక కీపింగ్ బాధ్యతలు రాహుల్ పై ఉండబోవు. స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటూ బ్యాటింగ్, నాయకత్వంపై దృష్టి పెట్టాలి. టీమ్ఇండియా భవిష్యత్ కెప్టెన్ అనడానికి.. టీమ్ఇండియా కెప్టెన్ అనడానికి మధ్య తేడా ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తనను తాను నిరూపించుకోవడానికి ఐపీఎల్ చక్కటి వేదిక. కెప్టెన్‌గా ఎదిగేందుకు ఈ మెగాటోర్నీ తోడ్పడుతుంది. అలాగని జాతీయ జట్టుకు కెప్టెన్ అవుతామన్న గ్యారంటీ మాత్రం ఉండదు."
- గౌతమ్ గంభీర్, భారత మాజీ ఆటగాడు