Gambhir about Virat Kohli: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ ఔటైన విధానంపై అనవసర రాద్దాంతం జరుగుతోందని అభిప్రాయపడ్డాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. తొలి టెస్ట్‌లో భారత్‌కు విజయం దక్కినా తానేమీ సంతృప్తి చెందలేదని అన్నాడు.
"స్విట్జర్లాండ్ మంచులో కుటుంబంతో కలిసి సమయాన్ని ఆస్వాదించి ఆదివారం సాయంత్రమే తిరిగొచ్చా. అక్కడ ఉంటూనే దక్షిణాఫ్రికాతో భారత తొలి టెస్టుపైనా ఓ కన్నేశా. టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 400కు పైగా పరుగులు చేస్తుందనుకున్నా. రాహుల్, మయాంక్ బలమైన పునాది వేశారు. కానీ మిడిలార్డర్ తమ పాత్ర పోషిస్తే జట్టు 327 పరుగులకే పరిమితమయ్యేది కాదు. బౌలింగ్‌లో రాణించి విజయాన్ని సాధించినా ఈ ఫలితంతో నేనేమీ ఎగిరి గంతేయడం లేదు. ప్రత్యర్థి నుంచి అసలైన సవాలు ఎదురు కాలేదని భారతీయులకు తెలుసు. అత్యంత బలహీనమైన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ బృందాల్లో ఇదొకటి. టెస్టుల్లో కదిలే బంతిని ఆడాలంటే అత్యుత్తమ నైపుణ్యాలుండాలి. కానీ ఈ సఫారీ బ్యాటింగ్ ఇంకా ఎదిగే దశలోనే ఉందనిపిస్తోంది. జొహన్నెస్‌బర్గ్ బ్యాటర్లకు కఠిన సవాలు విసురుతుంది. అధిక ఎత్తులో ఉండే ఈ మైదానంలో మంచి పేస్, బౌన్స్ లభిస్తుంది. విహారి లేదా శ్రేయస్ కోసం రెండో మ్యాచ్‌లో అయిదుగురితో కాకుండా నలుగురు బౌలర్లతో జట్టు ఆడాలనుకుంటుందని ఎక్కడో చదివా. కానీ అది కేవలం మీడియా ఊహాగానాలేనని నా నమ్మకం. ఎక్కువ పేస్ లభిస్తుంది కాబట్టి నేనైతే శార్దూల్ స్థానంలో ఉమేశ్‌ను తీసుకుంటా. నియంత్రణతో కూడిన అతని వేగం ఈ పిచ్‌పై కోహ్లికి అవసరం. గత మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 48 పరుగులు చేసిన రహానెకు రెండో టెస్టులోనూ చోటు దక్కుతుందనుకుంటున్నా. ద్రవిడ్ శిక్షణలో తన ఫామ్ అందుకునేందుకు పుజారాకు అవకాశాలు వస్తాయని భావిస్తున్నా. గత మ్యాచ్‌లో కోహ్లీ ఔటైన విధానంపై అనవసర రాద్దాంతం జరుగుతోంది. ఇప్పుడతను ఆఫ్‌స్టంప్ ఆవల పడ్డ బంతులను ఎక్కువగా వదిలేస్తూ కొద్ది సమయం క్రీజులో గడపాలి. కొత్త ఏడాది భారత క్రికెట్లో సరికొత్త అధ్యాయం రాబోతుంది. కానీ గెలిచినా లేదా ఓడినా అతిగా స్పందించవద్దు."