IPL 2022: ప్రస్తుతం రోహిత్ శర్మ భారత్‌కు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రోహిత్ మరో మూడేళ్ల పాటు కెప్టెన్‌గా కొనసాగే అవకాశం ఉంది. రోహిత్ తర్వాత కెప్టెన్సీ స్థానాన్ని భర్తీ చేయాలని పలువురు యువ ఆటగాళ్లు ప్రయత్నిస్తున్నారు. ఈ ఐపీఎల్లో కెప్టెన్లుగా రాణించి తమ సత్తా చాటాలనుకుంటున్నారు. మరి ఆ ఆటగాళ్లు ఎవరో చూద్దాం.
ఐపీఎల్ 2022పై దృష్టి పెట్టిన కేఎల్ రాహుల్
పంజాబ్ కింగ్స్ జట్టుకు రెండు సీజన్లలో నాయకత్వం వహించిన కేఎల్ రాహుల్‌ను.. కొత్త జట్టు లఖ్‌నవూ కెప్టెన్‌గా నియమించింది. కోహ్లీ గైర్హాజరుతో దక్షిణాఫ్రికా పర్యటనలో భారత కెప్టెన్‌గా విధులు నిర్వర్తించిన రాహుల్ నిరాశపరిచాడు. అతడు నాయకత్వం వహించిన టెస్టులో ఇండియా ఓడిపోయింది. ఆ తర్వాత జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను దక్షిణాఫ్రికా క్లీన్‌స్వీప్ చేసింది.
ఇక ఐపీఎల్ రికార్డుల విషయానికి వస్తే కెప్టెన్‌గా రాహుల్.. 44 శాతం విజయాలను నమోదు చేశాడు. 27 మ్యాచులకు నాయకత్వం వహించగా.. 12 మ్యాచుల్లో టీమ్ విజయం సాధించింది. 15 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. కెప్టెన్‌గా రాహుల్ రికార్డును పక్కనపెడితే బ్యాటింగ్‌లో మాత్రం అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఐపీఎల్ 2020, 2021 సీజన్లలో వరుసగా 600కు పైగా పరుగులు చేశాడు.
రాహుల్‌కు గట్టిపోటీ ఇవ్వనున్న అయ్యర్
కేఎల్ రాహుల్ తన ఫేవరెట్ కెప్టెన్ అని చెప్పాడు కోల్‌కతా కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. కానీ, టీమ్ఇండియా కెప్టెన్సీ విషయంలో.. వీరిద్దరి మధ్య కొంత పోటీ తప్పక ఉంటుంది. ఐపీఎల్ 2020లో దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు నాయకత్వం వహించిన అయ్యర్ తొలి సారి ఆ జట్టును ఫైనల్స్‌కు తీసుకెళ్లాడు. ఆ సీజన్లో బ్యాటుతోనూ రాణించాడు. ప్రశాంతంగా ఉంటూ దిల్లీని నడిపించిన శ్రేయస్‌ను చూసి.. భవిష్యత్ కెప్టెన్ అనుకున్నారు క్రికెట్ ప్రియులు. అయితే, గాయం కారణంగా కొంతకాలం క్రికెట్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాతి సీజన్లో దిల్లీ కెప్టెన్‌గా వ్యవహరించిన రిషభ్ పంత్.. ఆ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఓ దశలో శ్రేయస్‌కు.. టీమ్ఇండియాలో చోటుపై ప్రశ్నలు తలెత్తాయి. కానీ, ఇటీవల రీఎంట్రీ ఇచ్చి.. కీలక ఇన్నింగ్స్‌లతో సత్తా చాటాడు. ఇప్పుడు ఐపీఎల్లో కోల్‌కతా జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఈ సీజన్లో టీమ్‌ను మెరుగ్గా నడిపించగలిగితే.. టీమ్ ఇండియా కెప్టెన్సీకి గట్టిపోటీదారుడు అవుతాడు శ్రేయస్.
కెప్టెన్సీపై కన్నేసిన రిషభ్ పంత్
భారత తదుపరి కెప్టెన్ స్థానంపై కన్నేశాడు రిషభ్ పంత్. గతేడాది దిల్లీ క్యాపిటల్స్‌కు నాయకత్వం వహించిన పంత్.. జట్టును అద్భుతంగా నడిపించాడు. కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్‌లోనూ అదరగొట్టాడు. టీమ్ఇండియా తరఫునా కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. వయసు సైతం తక్కువగానే ఉండటం రిషభ్‌కు కలిసొచ్చే అంశం. ప్రస్తుతం టీమ్ఇండియా వైస్‌కెప్టెన్ రేసులో ఉన్న రిషభ్‌ను.. తదుపరి సారథిగా మేనేజ్మెంట్ తీర్చిదిద్దే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
వీరంతా.. ఐపీఎల్లో వ్యక్తిగత ప్రదర్శనతో పాటు సారథులుగా రాణిస్తే బాగుంటుంది. తమ కెప్టెన్సీ నైపుణ్యాలను ప్రదర్శించి, ఆకట్టుకుంటే రోహిత్ తర్వాత వీరిలో ఒకరు సారథ్య బాధ్యతలు స్వీకరించడం లాంఛనమే అవుతుంది. ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 26న ప్రారంభం కానుంది.
ఇదీ చదవండి:ఐపీఎల్లో హోరాహోరీగా సాగిన ముంబయి x చెన్నై మ్యాచ్‌లివే