Sarandeep Singh on Ashwin: టీమ్‌ఇండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, మాజీ కోచ్ రవిశాస్త్రిని తప్పుగా అర్థం చేసుకున్నాడని మాజీ సెలెక్టర్ శరణ్‌దీప్ సింగ్ అన్నాడు. 2018-19 ఆస్ట్రేలియా పర్యటనలో శాస్త్రి చేసిన వ్యాఖ్యలతో తాను బాధపడిటన్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు అశ్విన్. ఇదే అంశంపై శరణ్‌దీప్ స్పందిస్తూ.. శాస్త్రి ఉద్దేశాన్ని అశ్విన్ తప్పుగా అర్థం చేసుకున్నాడని తెలిపాడు.
"శాస్త్రి వ్యాఖ్యలను అశ్విన్ తప్పుగా అర్థం చేసుకున్నాడు. నాటి పర్యటనలో నేనూ జట్టుతోనే ఉన్నాను. విదేశాల్లో కుల్‌దీప్ అత్యుత్తమ బౌలర్ అని మాత్రమే శాస్త్రి ఉద్దేశం. ఎందుకంటే అక్కడి భిన్న పరిస్థితుల్లో తన బౌలింగ్ స్టైల్ వైవిధ్యంగా ఉంటుంది. దీన్ని అశ్విన్ మరోలా అర్థం చేసుకున్నాడు. ఇందులో శాస్త్రి చెప్పింది నిజమే. అశ్విన్ గొప్ప బౌలర్. ఇదివరకు ఆఫ్రికన్ పిచ్‌లపైనా బాగా రాణించాడు. అతడు గేమ్ ఛేంజర్ కూడా. అయితే, ఇది అతడికి చివరి పర్యటన కాదు. అతడు ఆడాల్సింది ఇంకా చాలా ఉంది. ఇక ఈ సిరీస్‌లో కోహ్లీ గురించి మాట్లాడాల్సి వస్తే.. చాలా మానసిక ప్రశాంతతతో ఆడతాడు. వన్డే కెప్టెన్సీ వివాదం అతడి ఆటపై ప్రభావం చూపదనుకుంటా. ఇంతకుముందు ఎలా ఆడాడో ఇకపై అలాగే రెచ్చిపోతాడు. ఇప్పుడిక అతడి నుంచి శతకం ఆశించొచ్చు. తనకిప్పుడు సరైన నాణ్యమైన జట్టు ఉంది" అని శరణ్‌దీప్ అభిప్రాయపడ్డాడు.