భవిష్యత్తులో టీమ్ఇండియా మూడు జట్లుగా విడిపోతుందని మాజీ లెజెండ్ కపిల్ దేవ్ అన్నాడు. టీ20లకు ఒక ప్రత్యేక జట్టు. వన్డేలకు, టెస్టులకు కూడా వేర్వేరు జట్లు ఉంటాయని కపిల్ అంచనా వేశాడు. ఇంతకుముందు కూడా భారత జట్టు ఒకేసారి రెండు జట్లతో ఆడిన సందర్భాలు ఉన్నాయి. 2021లో సీనియర్ జట్టు ఇంగ్లాండ్‌లో ఉండగా శ్రీలంకకు యువ జట్టును పంపించారు. అంతకుముందు 1988లో కూడా ఒక భారత జట్టు కామన్‌వెల్త్ క్రీడల్లో ఆడుతుండగా.. మరో జట్టు సహారా కప్ ఆడింది. ఇటీవలి కాలంలో చాలా మంది క్రీడాకారులు టీమ్ఇండియా అరంగేట్రం చేశారు. ఈ క్రమంలోనే భవిష్యత్తులో వివిధ ఫార్మాట్లకు వేరు వేరు జట్లు ఆడతాయని కపిల్ అంచనా వేశాడు.
'భవిష్యత్‌లో మూడు జట్లుగా టీమ్ఇండియా'.. మేనేజ్మెంట్కు కపిల్ చురకలు!
భారత క్రికెట్ జట్టుపై మాజీ లెజెండ్ కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌లో టీమ్ఇండియా మూడు జట్లుగా విడిపోతుందని కపిల్ అభిప్రాయపడ్డాడు. ఇంకా ఏమన్నాడంటే?
జట్టులో ఇలా మార్పులు చేయడం వల్ల చాలా మంది ఆటగాళ్లకు భారత్ తరఫున ఆడే అవకాశం ఉంటుందని చెప్పాడు. 'భవిష్యత్తులో టీమ్ఇండియా తరఫున మూడు జట్లు ఆడతాయని నేను అనుకుంటున్నా. అలా చేయడం వల్ల ఆటగాళ్ల పూల్ కూడా చాలా పెద్దది అవుతుంది' అని కపిల్ అభిప్రాయపడ్డాడు.
అయితే ఇలా ఎప్పటికప్పుడు జట్టులో మార్పులు, చేర్పులు చేయడంపై మాత్రం కపిల్ అసహనం వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో కుల్దీప్ యాదవ్‌ను పక్కన పెట్టడం వంటి నిర్ణయాలు సరైనవి కావన్నాడు. 'కనీసం ఒక టైమ్ పీరియడ్‌లో అయినా ఒక జట్టును కొనసాగించాలి. ఏదో ఒక ఆటగాడిని మారిస్తే ఓకే. కానీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ఆటగాడిని పక్కన పెట్టడం ఏంటి? క్రికెటర్లుగా ఇలాంటి నిర్ణయాలు మాకు కూడా అర్థం కావు' అంటూ టీమ్‌మేనేజ్‌మెంట్‌పై పరోక్షంగా చురకలేశాడు.