తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్ మాజీ​ ఛైర్మన్​ లలిత్ మోదీకి తీవ్ర అనారోగ్యం - ఎయిర్​ ఆంబులెన్స్​లో లండన్​కు లలిత్​ మోదీ

ఐపీఎల్​ మాజీ ఛైర్మన్​ లలిత్​ మోదీ కరోనా​ బారిన పడ్డారు. కొవిడ్​తో పాటు నిమోనియా తనను వేధిస్తోందని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు శుక్రవారం ఓ పోస్ట్​ ద్వారా తెలిపారు.

lalit modi
lalit modi

By

Published : Jan 14, 2023, 12:49 PM IST

ఐపీఎల్​ మాజీ ఛైర్మన్​ లలిత్​ మోదీ అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొవిడ్​తో పాటు నిమోనియా బారిన పడిన ఆయన ప్రస్తుతం ఆక్సిజన్​ సహాయంతో లండన్​లో చికిత్స పొందుతున్నారు. ఇన్​స్టాగ్రామ్​లో ఓ ఫొటో పోస్ట్​ చేసి ఈ విషయం వెల్లడించారు లలిత్. రెండు వారాల్లో కొవిడ్​ సోకడం ఇది రెండోసారి అని తెలిపారు. మొదటిసారి కొవిడ్​ సోకిన సమయంలో మెక్సికోలో ఉన్న లలిత్​ దాదాపు మూడు వారాల పాటు హోమ్​ క్వారెంటైన్​లో గడిపారు.

అప్పటికే ఆక్సిజన్​ సహాయంతో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతుండగా మరోసారి కొవిడ్​ సోకింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఇద్దరు వైద్యులతో పాటు ఓ ఎయిర్​ ఆంబులెన్స్​లో ఆయన్ను తదుపరి చికిత్స కోసం మెక్సికో నుంచి లండన్‌కు తరలించారు. ఆరోగ్యం క్షీణించినప్పటికీ తను కోలుకోవాలని ప్రార్థించిన వారికి కృతజ్ఞత తెలియజేయాలని ఆయన ఓ పోస్ట్​ పెట్టారు.

"ఇద్దరు వైద్యులతో ఎయిర్ అంబులెన్స్‌లో కుటుంబ సభ్యులతో కలిసి లండన్‌కు వచ్చాను. దురదృష్టవశాత్తు ప్రస్తుతం ఆక్సిజన్‌ ​​స్థాయి తక్కువగా ఉంది. ఇప్పటికీ ఆక్సిజన్​పై ఆధారపడాల్సి వస్తోంది. నా కోసం ప్రార్థించినందుకు అందరికీ ధన్యవాదాలు." అని పోస్ట్ చేశారు ఐపీఎల్​ మాజీ ఛైర్మన్​ లలిత్ మోదీ.

లలిత్​ మోదీ ఇన్​స్టా పోస్ట్​
ఆస్పత్రిలో లలిత్​ మోదీ

ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీకి క్రీడా ప్రపంచంతో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఐపీఎల్‌ను ప్రారంభించింది ఆయనే. చాలా కాలం పాటు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. 2008 నుంచి 2010 వరకు ఐపీఎల్ ప్రెసిడెంట్‌గా, కమిషనర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 2010లో లలిత్ మోదీపై మనీలాండరింగ్, బిడ్ రిగ్గింగ్ సహా మరికొన్ని ఆరోపణలు రాగా ఆయనపై వేటు పడింది. తర్వాత లలిత్ దేశం విడిచి వెళ్లిపోయారు.

ఇటీవల బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌తో కలిసి ఫోటోలు దిగి వార్తల్లో నిలిచారు లలిత్ మోదీ. గతేడాది జులైలో సుస్మితా‌సేన్‌తో ఉన్న ఫొటోలు పోస్ట్ చేసి వారి మధ్య అనుబంధాన్ని లలిత్ మోదీ ప్రకటించారు. అయితే తాజాగా ఆయన సుస్మితతో ఉన్న తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ఫొటోను, ఆమె గురించి లైన్ ఉన్న తన బయోను కూడా మార్చారు. దీంతో వారి మధ్య బ్రేకప్ అయినట్లు వార్తలు వచ్చాయి.

ABOUT THE AUTHOR

...view details