టీమ్ఇండియా మాజీ ఓపెనర్ సుధీర్ నాయక్(78) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబయిలోని ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు క్రికెట్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈ విషయాన్ని ముంబయి క్రికెట్ అసోసియేషన్ వర్గాలు తెలిపాయి. ఈయనకు ఓ కుమార్తె ఉంది. ఆమె దగ్గరే నాయక్ ఉంటున్నారు. "సుధీర్ నాయక్ ఇటీవల బాత్రూంలో జారిపడ్డారు. తలకు గాయం కావడం వల్ల కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. కోమాలోకి వెళ్లిన నాయక్ మళ్లీ కోలుకోలేదు" అని ముంబయి క్రికెట్ సంఘానికి చెందిన ఓ అధికారి చెప్పారు.
కాగా, సుధీర్ నాయక్.. నాయక్.. 1970-71 రంజీ ట్రోఫీ సీజన్లో బ్లూరీ బ్యాండ్ గ్లోరీ టీమ్‌కు నాయకత్వం వహించారు. అప్పుడు జట్టును గెలిపించి.. ట్రోఫీని ముద్దాడారు. సునీల్ గావస్కర్, అజిత్ వాడేకర్, దిలీప్ సార్దేశాయ్, అశోక్ మన్కడ్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు జట్టులో లేకుండానే ఆయన తన టీమ్‌ను గెలిపించారు. 1972 రంజీ సీజన్లో తుది జట్టులో ఆయనకు చోటు దక్కలేదు. ఇక 1974లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లారు. బర్మింగ్ హమ్ వేదికగా జరిగిన టెస్టుతో అరంగేట్రం చేశారు. అప్పుడు అరంగేట్రంలోనే రెండో ఇన్నింగ్స్‌లో 77 పరుగులు హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నారు.