టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యశ్పాల్ శర్మ గుండెపోటుతో మృతి చెందారు. 1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో యశ్పాల్ సభ్యుడు. ఈ మెగాటోర్నీలో కపిల్‌సేన విశ్వ విజేతగా నిలవడంలో యశ్పాల్ కీలక పాత్ర పోషించారు.
కెరీర్లో 37 వన్డేలతో పాటు 42 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు యశ్పాల్. 1979-83 కాలంలో భారత జట్టు మిడిలార్డర్లో కీలక బ్యాట్స్‌మన్‌గా సేవలందించారు. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కొద్దికాలం జాతీయ సెలెక్టర్‌గా పనిచేశారు. రంజీల్లో పంజాబ్, హరియాణాతో పాటు రైల్వేస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. దేశవాళీల్లో 160 మ్యాచ్‌లు ఆడిన ఈ మాజీ క్రికెటర్.. 8,933 పరుగులు సాధించారు. ఇందులో 21 సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 201*.
యశ్పాల్ మృతిపై సహచర క్రికెటర్ మదన్‌లాల్ స్పందించారు. "యశ్పాల్ లేడనే విషయం నమ్మలేకపోతున్నా. అతడితో కలిసి ఆడిన రోజులు గుర్తొస్తున్నాయి. పంజాబ్ జట్టుతో మొదలైన మా ప్రయాణం.. ప్రపంచకప్‌లోనూ కొనసాగింది. అతడు చనిపోయారనే విషయం కపిల్ చెప్పాడు. అందరం ఒక్క సారిగా షాకయ్యాం. అతని క్రికెట్ జీవితం అద్భుతం. ఇటీవల ఓ బుక్ లాంచ్ సందర్భంగా కలిశాం. ఇది నేను నమ్మలేకపోతున్నా. అతడికి భార్యతో పాటు ముగ్గురు పిల్లలున్నారు" అని భావోద్వేగం చెందారు.